యమునా ఎక్స్ ప్రెస్ వే వద్ద దారుణం చోటుచేరసుకుంది. ఓ యువతి మీద నుంచి వేగంగా వస్తున్న కారు దూసుకెళ్లింది. తీవ్రగాయాలపాలైన యువతి దేశరాజధాని ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. కాగా... యువతిపై ఆమె స్నేహితులే ఇద్దరు అత్యాచారానికి పాల్పడి అనంతరం ఇలా చంపేశారంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించడం గమనార్హం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నోయిడాకు చెందిన యువతి(20) నోయిడాలో పని చేస్తోంది. శుక్రవారం యువతి తన తోటి ఉద్యోగిని(20), ఆమె సోదరుడు(22), మరో స్నేహితుడు(21)తో కలిసి మధుర వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న  క్రమంలో వీరు వెళ్తున్న ద్విచక్రవాహనం  ప్రమాదానికి గురైంది. యమునా ఎక్స్ ప్రెస్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Also Read మసీదులో హిందూ పెళ్లి.. ఫోటోలు వైరల్...

సదరు  యువతి తాను మథుర వెళ్తున్నట్లు కుటుంబసభ్యులతో చెప్పలేదు. ఇంట్లో చెప్పకుండా... స్నేహితులతో వెళ్లింది. వీరు రెండు ద్విచక్రవాహనాలపై నలుగురు వెళ్లారు. తిరిగి వస్తుండగా... నవజిల్ టోల్ ప్లాజా సమీపంలో.. సదరు యువతి వాష్ రూమ్ కి వెళ్లాల్సి వచ్చింది. దీంతో.. తన స్నేహితుడిని బైక్ ఆపమని కోరింది. అతను బైక్ ఆపగానే... ఆమె వాష్ రూమ్ కి వెళ్లేందుకు రోడ్డు దాటుతోంది. ఈ క్రమంలో అటుగా వస్తున్న ఓ కారు వేగంగా వచ్చి యువతిని ఢీ కొట్టింది.

వెంటనే సదరు యువతిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ తరలించారు. కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం యువతి ప్రాణాలు విడిచింది.

అయితే... తమ కూతురితోపాటు ఉన్న ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని.. ఆ తర్వాత పథకం ప్రకారం చంపాలని చూశారని యువతి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.