హోటల్‌లో కెమెరాలు, బాత్‌రూంలో కెమెరాలు.. ఇలా ప్రతి చోటా స్త్రీకి ప్రైవసీ లేకుండా పోతోంది. తాజాగా నడిరోడ్డుపైనా మహిళలను వదలడం లేదు. ఓ వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 1,800 మంది మహిళలు, అమ్మాయిలను తన ఫోన్ ద్వారా ఫోటో తీశాడు.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం మేగనూరుకు చెందిన అయ్యనార్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 42 ఏళ్ల ఈ వ్యక్తి  అతని కుమార్తెకు ఇటీవల  వివాహం చేసినట్లు చేశాడు.

అయితే ఇతని బుద్ధివంకర కావడంతో పట్టణంలోని బస్టాండ్, బజారువీధి, సంత ప్రాంతాల్లో నడిచి వెళుతున్న అందమైన అమ్మాయిలు, మహిళలు సుమారు 1,800 మందివి ఫోటోలు తీశాడు.

ఈ అలవాటులోనే శుక్రవారం సాయంత్రం మోగనూరు బస్టాండ్  వద్ద శక్తివేలు అనే వ్యక్తి భార్యను అయ్యనార్ ఫోటోలు తీశాడు. దీంతో భయాందోళనకు గురైన శక్తివేలు అతనిని నిలదీశాడు.

ఆగ్రహించిన అతను శక్తివేలుపై దాడి చేయడంతో పాటు చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో బాధితుడు మోగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఖాకీలు అయ్యనార్‌ను పట్టుకుని విచారణ జరిపారు.

దర్యాప్తులో భాగంగా అతని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా.. అందులో 1,800 మంది మహిళలు ఫోటోలు ఉండటంతో దిగ్బ్రాంతికి గురయ్యారు. కేసు నమోదు చేసుకుని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.