ఓ వ్యక్తి కారు డ్రైవింగ్ చేస్తూ  కొడుకుతో కలిసి పనిమీద వెళుతున్నాడు.కాగా.. మార్గమధ్యంలో ఆయనకు మూర్చ రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అదృష్టవశాత్తు కారు ఆగడంతో కారులోని కొడుకు ప్రాణాలతో బటయపడ్డాడు. ఈ విషాదకర సంఘటన  కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలుకా ఆలాళసంద్ర గ్రామానికి చెందిన శివకుమార్‌(35) బుధవారం కుమారుడు పునిత్‌తో కలిసి కుక్కర్ల లోడ్‌ తీసుకెళ్తుండగా హులియూరు సమీపంలో మూర్ఛకు సీటులో వెనక్కువాలిపోయాడు.  అయితే వాహన వేగం తక్కువగా ఉండటంతో ఆగిపోయింది. 

తండ్రికి  ఏమైందో తెలియక ఎనిమిది సంవత్సరాల కుమారుడు బిక్కుబిక్కుమంటూ గడిపాడు. స్థానికులు వచ్చి పరిశీలించగా శివకుమార్‌ మృతి చెందినట్లు గుర్తించి హులియూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. బంధువులకు సమాచారం అందిచారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.