Asianet News TeluguAsianet News Telugu

కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ.. రెండు వారాల్లో ప్రకటన.. టచ్‌లో డజను కాంగ్రెస్ నేతలు!

పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ కొత్త పార్టీని స్థాపించబోతున్నారు. రెండు వారాల్లో ఈ పార్టీ ప్రకటన ఉంటుందని కొన్నివర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆ పనిలో అమరీందర్ సింగ్ తలమునకలై ఉన్నారని, కాంగ్రెస్ నుంచి డజను మంది నేతలు టచ్‌లో ఉన్నారని తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ నెలలోనే కొత్త పార్టీ స్థాపించనున్నట్టు వార్తలు రావడం కొత్త ట్విస్ట్‌ను ముందుకుతెచ్చాయి.
 

captain amarinder singh to float new party in punjab
Author
Chandigarh, First Published Oct 1, 2021, 1:16 PM IST

చండీగడ్: పంజాబ్‌(Punjab)లో పరిణామాలు.. కాంగ్రెస్(Congress) కోరి కొరివి తెచ్చుకున్నట్టుగా మారుతున్నాయి. మాజీ సీఎం, సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్(Captain Amarinder singh) పార్టీ వీడటం, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి సిద్దూ(Navjot singh sidhu)ను ఎంచుకోవడం, ఆయన రాజీనామా చేసి మళ్లీ రాజీకి రావడం వంటి పరిస్థితులు ‘కక్కలేక మింగలేక’ అన్నట్టుగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలల కాలమే ఉన్న తరుణంలో ఈ పరిణామాలు కాంగ్రెస్ అధికారాన్ని నిలుపుకున్న కొద్ది రాష్ట్రాల జాబితాకూ కొర్రి పెట్టేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు ఇంకో తలనొప్పి మొదలుకానుంది. కెప్టెన్ అమరీందర్ సింగ్ స్వయంగా పార్టీ(New Party)ని వ్యవస్థాపించనున్నట్టు(Float) సమాచారం అందింది. అసెంబ్లీ ఎన్నికలను(Assembly Elections) దృష్టిలో పెట్టుకుని పక్షం రోజుల్లో(15 రోజుల్లో)నే ఈ ప్రకటన చేయనున్నారని తెలిసింది.

కొత్త పార్టీ కోసం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ నేతలే కనీసం డజను మంది ఆయనతో టచ్‌(Touch)లో ఉన్నట్టు తెలిసింది. కొత్త పార్టీ పెట్టే నిర్ణయంపై తన మద్దతుదారులతో అభిప్రాయాలు సేకరించనున్నారు. అంతేకాదు, పంజాబ్ రైతు నేతల(Farmer Leaders)తోనే సమావేశం కాబోతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో రైతు ఆందోళన ప్రభావం బలంగా ఉన్నది. ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న నిరసనకారుల్లో మెజార్టీగా రైతులు పంజాబ్ నుంచే ఉంటారు. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా మారే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే కొత్తపార్టీకి ముందు అమరీందర్ సింగ్ రైతు నేతలతో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు.

కాంగ్రెస్‌లో తాను అవమానాలకు గురికావడానికి కారణంగా భావిస్తున్న నవ్‌జోత్ సింగ్ సిద్దూ అసెంబ్లీలో అడుగుపెట్టకుండా కచ్చితంగా అడ్డుకుని తీరుతారని ఇప్పటికే అమరీందర్ సింగ్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా, అక్కడ బలమైన ప్రత్యర్థిని నిలిపే ఆలోచనలో అమరీందర్ సింగ్ ఉన్నారు.

తాను కాంగ్రెస్ వీడినట్టు ప్రకటించిన అమరీందర్ సింగ్ బీజేపీలోనూ చేరడం లేదని స్పష్టం చేశారు. అంతకు ముందే ఆయన ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. అమిత్ షాతో రైతు సమస్యలపై మాట్లాడినట్టు తర్వాత వెల్లడించినా అప్పుడు ఆయన బీజేపీలో చేరే అవకాశముందనే చర్చ నడిచింది.

అంతేకాదు, ఒకవేళ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరకున్నా.. మరో పార్టీ పెట్టుకోవాలని బీజేపీ నేతలు సూచించే అవకాశాలున్నాయి. పంజాబ్‌లో ప్రస్తుతం బీజేపీకి బలం లేకుండా పోయింది. ఎన్డీఏలో భాగంగా ఉన్న శిరోమణి అకాలీదళ్ ఇటీవలే రైతు చట్టాల కారణంగా కూటమికి స్వస్తి పలికింది. ఈ నేపథ్యంలోనే అమరీందర్ సింగ్ సొంతంగా పార్టీ స్థాపించి ఎన్డీఏకు మద్దతునిచ్చినా చాలనే ఆలోచన బీజేపీలో ఉన్నట్టు తెలుస్తున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios