అగ్నిపథ్ స్కీంపై ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ హర్షం వ్యక్తం చేసింది. అగ్నిపథ్ స్కీం ద్వారా రిక్రూట్ అయి రిటైర్ అయిన అగ్నివీర్లను తాము ప్రాధాన్యతతో నియమించుకుంటామని తెలిపింది. అగ్నిపథ్ స్కీం వ్యూహాత్మకమైనదని క్యాప్సి చైర్మన్ తెలిపారు.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అగ్నిపథ్ స్కీంపై హింసాత్మక ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో అనూహ్యంగా సెంట్రల్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ (క్యాప్సి) ఆ స్కీంపై ప్రశంసల వర్షం కురిపించింది. ప్రధాని మోడీ ఈ స్కీంను వ్యూహాత్మకంగా ముందుకు తెచ్చారని పొగిడింది. అంతేకాదు, అగ్నిపథ్ స్కీం కింద ఆర్మీలో చేరి రిటైర్ అయిన అగ్నివీర్లకు ప్రాధాన్యం ఇచ్చి తాము రిక్రూట్ చేసుకుంటామని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ ఉన్నత సంస్థ క్యాప్సి చైర్మన్ కే విక్రమ్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
ప్రైవేట్ సెక్యూరిటీ రంగానికి నైపుణ్యం గల సెక్యూరిటీ అధికారులను పెద్ద సంఖ్యలో అవసరం ఉన్నదని ఆయన లేఖలో పేర్కొన్నారు. కార్పొరేట్, కమ్యూనిటీ సెక్యూరిటీ, సీఐఎస్ఎఫ్‌తో హైబ్రిడ్ సెక్యూరిటీ ఎంగేజ్‌మెంట్లకూ తమకు పెద్ద మొత్తంలో సెక్యూరిటీ ఆఫీసర్లు అవసరం ఉన్నారని తెలిపారు. కాబట్టి, ఈ లోటును తాము రిటైర్ అయిన అగ్నివీర్ల ద్వారా తీర్చుకుంటామని చెప్పారు. తమకు అనుగుణంగా ప్రమాణాలకు అనుకూలంగా శిక్షణ ఇచ్చి వారిని తాము ప్రాధాన్యతతో రిక్రూట్ చేసుకుంటామని తెలిపారు.
అగ్నిపథ్ స్కీం తేవడంపై ప్రధాని మోడీకి ఆయన అభినందనలు తెలిపారు. అగ్నిపథ్ స్కీం వ్యూహాత్మక ప్రణాళికతో వచ్చిందని, ఈ పథకం ద్వారా కేవలం దేశ భద్రతనే కాదు.. యువతలోనూ ఒక ‘సురక్ష’ సంస్కృతిని తెస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశ భద్రతను పెంపొందించడంలోనూ ఈ స్కీం గేమ్ చేంజర్ వంటిదని తెలిపారు.
ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు ద్వారా పెద్ద మొత్తంలో యువతకు ఉపాధి అవకాశాలు కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, గ్రామీణ పేద, మధ్య తరగతి వర్గాల్లో కొత్త సామాజిక ఆర్థిక వాతావరణాన్ని సృష్టిస్తుందని తెలిపారు. ఈ కొత్త ప్రాజెక్టు పూర్తిగా దేశంలోని ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీకి మద్దతుగా ఉన్నదని వివరించారు.
