దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల కమిషన్ సన్నాహాలు మొదలుపెట్టింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి ప్రవేశించేవారికి తప్పనిసరిగా కోవిడ్ నెగెటివ్ ఆర్‌టీ-పీసీఆర్ లేదా ఆర్ఏటీ నివేదికను కానీ, కోవిడ్ 19 టీకా రెండు డోసులు వేసుకున్న ధృవీకరణ పత్రాలు కానీ తప్పనిసరి సమర్పించాలని తెలిపింది. 

ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి వెళ్లాలనుకునే అభ్యర్థులు, వారి తరఫు ఏజెంట్లు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి శాసనసభలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 2న జరగనుంది. 

పశ్చిమ బెంగాల్ లో చివరి దశ పోలింగ్ ఏప్రిల్ 29 అంటే గురువారం జరుగుతుంది. మే 1న అభ్యర్థులకు, వారి తరఫు కౌంటింగ్ ఏజెంట్లకు ఆర్‌టీ-పీసీఆర్ /ఆర్ఏటీ టెస్టులు నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి ఏర్పాట్లు చేస్తారని ఈసీ తెలిపింది. 

ఈ పరీక్షలు చేయించుకోని అభ్యర్థులను, కౌంటింగ్ ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించేది లేదని తెలిపింది. కోవిడ్ 19 నిరోధక వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నట్లు దృవీకరించాలని, లేకపోతే ఆర్‌టీ-పీసీఆర్ /ఆర్ఏటీ టెస్టులు నెగెటివ్ రిపోర్టులు కానీ సమర్పించాలని తెలిపింది. 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona