Asianet News TeluguAsianet News Telugu

నామినేషన్ వేయడానికి దున్నపోతుపై వెళ్లిన అభ్యర్థి.. పెట్రోల్ ధర భరించలేనని వ్యాఖ్య

ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి చమురు ధరలపై వినూత్న రీతిలో నిరసన చేశారు. నామినేషన్ వేయడానికి దున్నపోతుపై వెళ్లారు. పెట్రోల్, డీజిల్‌ను కొనుగోలు శక్తి తనకు లేదని ఆయన వివరించారు. బిహార్‌లో త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నారు.
 

candidate went on buffalo to file nomination in bihar
Author
Patna, First Published Sep 13, 2021, 4:41 PM IST

పాట్నా: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలపై నిత్యం నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఫలితంగా నిత్యావసర ధరలూ క్రమంగా పెరుగుతున్నాయి. వీటిపై వినూత్న నిరసనలు వస్తున్నాయి. బిహార్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి ఓ అభ్యర్థి దున్నపోతును ఎంచుకున్నాడు. పెట్రోల్, డీజిల్‌ను కొనుగోలు చేయడం తనతో కాదని, అది తన శక్తికి మించినదని సదరు అభ్యర్థి పేర్కొన్నారు. అందుకే నామినేషన్ వేసి రావడానికి దున్నపోతును వాహనంగా ఎంచుకున్నట్టు సెలవిచ్చారు. 

కాతిహార్ జిల్లాలో రామ్‌పూర్ అనే పంచాయతీ ఉన్నది. ఈ పంచాయతీకి చెందినవాడే ఆజాం ఆలం. ఈ పంచాయతీ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నారు. ఇందుకోసం నిన్న నామినేషన్ కూడా వేశారు. ఈ ప్రక్రియలోనూ తన వైఖరిని స్పష్టం చేసుకున్నారు. ఇంధన ధరలపై నిరసన వ్యక్తం చేస్తూ దున్నపోతుపై వెళ్లి నామినేషన్ వేశారు. ‘నేను పశువులు పెంచుతాను. కాబట్టి, దున్నపోతుపై వచ్చాను. ప్రస్తుత ధరలు పెట్టి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయలేను’ అని తెలిపారు.

బిహార్‌లో ఈ నెల 24 నుంచి డిసెంబర్ 12వరకు 11 దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. వరదల బారినపడ్డ జిల్లాలు తొలి దశలో బరిలో లేవు.

Follow Us:
Download App:
  • android
  • ios