కరోనా వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయనీ, మరీ ముఖ్యంగా క్యాన్సర్‌ పేషెంట్ల సంఖ్య పెరుగుతోందని యోగా గురు బాబా రాందేవ్‌ చెప్పారు. కరోనా వ్యాప్తి ముగిసినప్పటి నుంచి క్యాన్సర్‌ పేషెంట్లు బయటకు వస్తున్నారని ఆయన తెలిపారు. 

యోగా గురు బాబా రామ్ దేవ్ మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాజా కరోనా మహమ్మారికి, క్యాన్సర్ కు ముడివేస్తూ.. అశాస్త్రీయ వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి తర్వాత.. దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని బాబా రామ్‌దేవ్ శనివారం పేర్కొన్నారు. శనివారం ఉదయం గోవాలోని మిరామార్ బీచ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ .. ఇటీవల దేశంలో క్యాన్సర్ కేసులు చాలా పెరిగాయి. కరోనా తర్వాత.. ఈ వ్యాధి కేసులు ఎక్కువయ్యాయి. ప్రజలు తమ కంటి చూపును, వినే సామర్థ్యాన్ని కూడా కోల్పోయారని అన్నారు. భారతదేశం గ్లోబల్‌ సెంటర్‌ ఆఫ్‌ వెల్‌నెస్‌గా మారాలని, అది ప్రధాని నరేంద్ర మోదీ కల అని, గోవా వెల్‌నెస్‌కు కేంద్రంగా మారాలన్నది నా కల అని, ఇతర వ్యాధులకు చికిత్స పొందేందుకు గోవా రావాలని అన్నారు.

యోగా, ఆయుర్వేదం, సనాతన, ఆధ్యాత్మికతతో కూడిన పర్యాటక కేంద్రంగా గోవా మారాలని అన్నారు. టూరిస్టుల సంఖ్య తక్కువగా ఉన్న రెండు నెలల్లో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించగలమని బాబా రామ్‌దేవ్ అన్నారు. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఇక్కడికి వచ్చేవారు. ఇదిలా ఉండగా.. హోటల్ పరిశ్రమ తమ సంస్థల్లో ఆయుర్వేద 'పంచకర్మ' ప్రారంభించాలని, పర్యాటకులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. వేదికపై ఆయనతోపాటు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా ఉన్నారు.

అయితే వైద్య నిపుణులు బాబా రామ్ దేవ్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. కరోనాకు, క్యాన్సర్ కు ఎటువంటి సంబంధం లేదని,కేసుల పెరుగుదల సాధారణ దృగ్విషయమని ప్రఖ్యాత ఆంకాలజిస్ట్ , ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గోవా యూనిట్ మాజీ చీఫ్ డాక్టర్ శేఖర్ సల్కర్ అన్నారు. క్యాన్సర్ కేసులు ప్రతి రెండేళ్లకు ఐదు శాతం పెరుగుతున్నాయని, దీనికి మహమ్మారితో సంబంధం లేదని ప్రఖ్యాత ఆంకాలజిస్ట్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదలతో క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. ప్రతి రెండేళ్లకోసారి ఐదు శాతం కేసులు పెరుగుతున్నాయని తెలిపారు.
భారతదేశంలో ప్రతి లక్ష జనాభాకు 104 మంది క్యాన్సర్ రోగులు ఉన్నారు, 2018లో లక్షకు 85 మంది రోగులు ఉన్నారని డాక్టర్ సల్కర్ గుర్తించారు. అదే సమయంలో.. లక్షకు 500 మంది రోగుల రేటును దాటిన USA కంటే మేము చాలా మెరుగ్గా ఉన్నామని అన్నారాయన. మన జీవనశైలిని సరిదిద్దుకోకుంటే అమెరికా క్యాన్సర్ రేటును భారత్ అధిగమించే అవకాశం ఉందని ఆయన అన్నారు. COVID-19 మహమ్మారి తర్వాత క్యాన్సర్ పెరిగిందని చెప్పడానికి ఎటువంటి డేటా లేదని తెలిపారు