రాహుల్ గాంధీకి కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టాలని లేకపోతే.. ఆయనను బలవంతపెట్టలేమని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. సోనియా గాంధీకి అనారోగ్యం రీత్యా మరెంతో కాలం అధ్యక్ష బాధ్యతలు వహించేలా లేదు. రాహుల్ గాంధీ మాత్రం తాను బాధ్యతలు తీసుకోనని తెగేసి చెబుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుల కోసం గాంధీయేతరుల వైపు చూస్తున్నారనే వాదనలూ వస్తున్నాయి.
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీకి ఇష్టం లేకున్నా.. ఆయనే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కావాలని ఫోర్స్ చేయలేమని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ సమావేశంలో కొందరు విలేకరులు దిగ్విజయ్ సింగ్‌ను పార్టీ అధ్యక్ష పోస్టు గురించి ప్రశ్నలు వేశారు. రాహుల్ గాంధీ తన అభిప్రాయాన్ని మార్చుకోవాలని ఆయనకు మీరు అప్పీల్ చేస్తారా? అని ఓ ప్రశ్న వచ్చింది. దీనికి ఆయన సమాధానం కొంచెం కొత్తగా ఉన్నది. బహుశా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం గాంధీయేతరుల వైపు చూస్తున్నదని చెప్పడానికి సంకేతంగానూ ఉన్నది.
ఆ ప్రశ్నకు సమాధానంగా.. ఆ అప్పీల్ అందరికీ తెలిసిందే. కానీ, నిర్ణయం రాహుల్ గాంధీనే తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకానీ, ఎవరినైనా సరే పర్టికులర్ నిర్ణయం తీసుకోవాలని ఎలా ఫోర్స్ చేయగలం? అని అన్నారు. అందరినీ ఏకతాటి మీదకు తేవడానికి తాము ప్రయత్నిస్తున్నామని వివరించారు.
కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ మాత్రం బ్రైట్‌గా ఉన్నదని ఆయన పేర్కొన్నారు.
రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఒక్క రోజు ముందు ఇందుకు పూర్తిగా విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని, లేదంటే కార్యకర్తలు అందరూ నిరాశలోకి జారుకుంటారని ఆయన పేర్కొన్నారు.
దేశంలోని కాంగ్రెస్ వాదులంతా నిరాశ చెందుతారని, వారంతా రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా చూడాలనుకుంటున్నారని వివరించారు. దేశంలోని కాంగ్రెస్‌మెన్ల సెంటిమెంట్లను అర్థం చేసుకుని రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరించాలని కోరారు. రాహుల్ గాంధీకి పార్టీలో ఏకగ్రీవ మద్దతు ఉన్నదని తెలిపారు.
రాహుల్ గాంధీ అధ్యక్ష పదవిని స్వీకరించకుంటే గాంధీయేతరులనైనా నియమించుకోవాలని పార్టీ భావిస్తున్నట్టు కొన్ని వర్గాలు తెలిపాయి. సోనియా గాంధీకి అనారోగ్యం ఉండటం మూలంగా మరెంతో కాలం తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టలేనని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనుభవం దృష్ట్యా ప్రియాంక గాంధీకి ఈ బాధ్యతలు ఇవ్వడం శ్రేయస్కరం కాదనే అభిప్రాయాలు ఉన్నాయి.
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తాను మళ్లీ ఆ బాధ్యతలు చేపట్టబోనని స్పష్టం చేశారు. తన వైఖరిని మార్చుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే పార్టీ సీనియర్ నేతలు గాంధీయేతరుల వైపు దృష్టి సారిస్తున్నట్టు ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయి.
