వరకట్న వేధింపుల కేసుకు సంబంధించి Tis Hazariలోని అదనపు సెషన్స్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్తింటి కుటుంబంలోని ప్రతి ఒక్కరిపై వరకట్న వేధింపుల అభియోగాలు మోపకూడదని చెప్పింది.

వరకట్న వేధింపుల కేసుకు సంబంధించి ఢిల్లీ Tis Hazariలోని అదనపు సెషన్స్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్తింటి కుటుంబంలోని ప్రతి ఒక్కరిపై వరకట్న వేధింపుల అభియోగాలు మోపకూడదని చెప్పింది. ఫిర్యాదుదారు ఆరోపిస్తే.. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను కూడా అందించాలని. ఇది సంబంధిత కుటుంబ సభ్యుని హింసను రుజువు చేస్తుందని పేర్కొంది. ప్రతి చిన్న వివాదాన్ని హింసగా పేర్కొనలేమని అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే వరకట్న వేధింపులు, నేరపూరిత నమ్మక ద్రోహానికి సంబంధించి ఓ మహిళ మామను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. 

తన అత్తమామల ఇంట్లో వేధింపుల నుంచి మహిళలను రక్షించేందుకు వరకట్న వేధింపుల చట్టాన్ని రూపొందించినట్లు కోర్టు తన తీర్పులో పేర్కొంది. ‘‘అయితే.. ఇటీవలి సంవత్సరాలలో ఈ చట్టం దుర్వినియోగం అవుతోంది. కొన్ని సంఘటనల్లో అత్తమామల కుటుంబంలోని వారు మాత్రమే కాకుండా ఇతర బంధువులు కూడా చిన్న చిన్న వివాదాల్లో వరకట్న వేధింపుల తప్పుడు కేసులలో ఇరికించబడ్డారని దేశంలోని సీనియర్ కోర్టులు ఎప్పటికప్పుడు తమ తీర్పుల్లో సూచిస్తున్నాయి. సాక్ష్యాధారాలు లేకపోవడంతో వారు చివరికి నిర్దోషిగా ప్రకటించబడుతున్నారు.. కానీ వారు మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురవుతున్నారు’’ తీస్ హజారీలోని అదనపు సెషన్స్ జడ్జి సంజీవ్ కుమార్ తీర్పులో పేర్కొన్నారు. 

ఈ కేసుకు సంబంధించి.. చాందినీ చౌక్ ప్రాంతంలో నివసిస్తున్న ఒక మహిళ తన భర్త , అత్తపై నాలుగు సంవత్సరాల క్రితం 2018లో వరకట్న వేధింపులు, నేరపూరిత నమ్మక ద్రోహం ఫిర్యాదు చేసింది. ట్రయల్ కోర్టు అభియోగాలు మోపింది. కింది కోర్టు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మహిళ అత్తింటివారు సెషన్స్ కోర్టులో సవాలు చేశారు. అయితే తాజాగా దిగువ కోర్టు నిర్ణయాన్ని సెషన్స్ కోర్టు తోసిపుచ్చింది.

వరకట్న వేధింపుల చట్టం దుర్వినియోగమవుతోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టంగా సూచించిందని సెషన్స్ కోర్టు పేర్కొంది. తప్పుడు వరకట్న వేధింపుల కేసుల్లో భర్త కుటుంబాన్ని నిందించడం పరిపాటిగా మారిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.