CAG నివేదిక: నిర్ణీత సమయంలో ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంపై డీఆర్డీవోని కాగ్ (CAG) మందలించింది. దీనితో పాటు, సైన్యంతో మెరుగైన సమన్వయం లేదని కూడా విమర్శించింది.
కాగ్ నివేదిక: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) పనితీరుపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) అసహనం వ్యక్తం చేసింది. డీఆర్డీఓ తన ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తి చేయడం లేదని, తన బలగాలతో ఉపయోగించి పనులను పూర్తి చేయలేదని CAG మండిపడింది. నియంత్రణ రేఖపై చైనాతో గొడవలు జరుగుతున్నాయని, అలాంటి సమయంలో దేశ సైన్యాలకు ఆయుధాలు, ట్యాంకులు, ఫిరంగులు, క్షిపణులు, యుద్ధ విమానాలను తయారు చేసే ప్రభుత్వ సంస్థ డీఆర్డీవోను కాగ్ తీవ్రంగా మందలించింది. ప్రాజెక్టుల ప్రారంభం, అమలులో డీఆర్డీవో గణనీయమైన జాప్యం జరిగిందని గురువారం పార్లమెంటులో ఉంచబడిన కాగ్ నివేదిక హైలైట్ చేసింది.
178 ప్రాజెక్టులలో 119లో జాప్యం
కాగ్ నివేదిక ప్రకారం.. 178 ప్రాజెక్ట్‌లలో 119 ప్రాజెక్టుల పనితీరులో జాప్యం జరిగిందనీ, అసలు సమయ షెడ్యూల్‌లను పాటించలేదనీ పేర్కొంది. అలాగే.. మరో 49 ప్రాజెక్టుల విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొందనీ, అసలు సమయ పరిమితిలో 100 శాతం కంటే ఎక్కువ ఆలస్యం జరిగిందని కాగ్ నివేదిక పేర్కొంది. 16 ప్రాజెక్ట్‌లలో 500 శాతం వరకు జాప్యం జరిగిందని, నిర్ణీత సమయానికి కంటే.. అనేకసార్లు పొడిగింపు జరిగిందని పేర్కొంది. ప్రాజెక్ట్ ను విజయవంతంగా పూర్తి చేయడానికి బదులుగా నిర్ణీత సమయాన్ని పొడిగింపు కోరడంలో డీఆర్డీవో విజయం సాధించిందని నివేదిక విమర్శించింది.
నిర్ణీత లక్ష్యాలను సాధించకున్న DRDO విజయవంతంగా ప్రకటించిన 15 ప్రాజెక్టుల కోసం రూ. 516.61 కోట్లను ఖర్చు చేసిందని నివేదిక ఎత్తి చూపింది.జనవరి 2010 నుంచి డిసెంబర్ 2019 వరకు విజయవంతమైనట్లు ప్రకటించిన 86 ప్రాజెక్ట్‌లలో.. ₹1,074.67 కోట్ల వ్యయంతో కూడిన 20 ప్రాజెక్ట్‌లను చేపట్టారనీ, అయితే.. అవి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కీలక లక్ష్యం(లు)/పారామీటర్(లు) సాధించలేదని నివేదిక పేర్కొంది. DRDO ప్రణాళిక అమలులోని అసమర్థతలను కూడా CAG గుర్తించింది. అలాగే దేశంలోని ప్రధాన పరిశోధనా సంస్థ ద్వారా MM ప్రాజెక్ట్‌లను సరిపడా పర్యవేక్షించకపోవడం వంటి సమస్యలను లేవనెత్తింది. మొత్తం ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో అసమర్థత కారణంగా ఖర్చులు అధికం కావడం, ప్రాజెక్ట్‌ల యొక్క ఊహించిన ప్రయోజనాలను ఎక్కువగా అంచనా వేయడం, ముగింపు నివేదికల సమర్పణలో జాప్యం వంటి అనేక సందర్భాలు చోటుచేసుకున్నాయని పేర్కొంది.
విజయవంతమైన ప్రాజెక్టుల ఉత్పత్తిలో జాప్యం వంటి అంశాలను కూడా కాగ్ బయటపెట్టింది. జాప్యం కారణంగా.. ప్రాజెక్టుల ఉద్దేశ్యం దెబ్బతిందని పేర్కొంది. డీఆర్డీవో, సైన్యం మధ్య సమన్వయ లోపం కూడా ఉందనీ, దీని ఫలితంగా గుణాత్మక అవసరాలు,డెలివరీలు, వినియోగదారు ట్రయల్స్ ఫలితాలపై భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయని తెలిపింది. తద్వారా మిషన్ మోడ్ ప్రాజెక్ట్‌ల మొత్తం సక్సెస్ రేటును ప్రభావితం చేసిందని నివేదిక పేర్కొంది. DRDO సాయుధ దళాల కోసం ఆయుధాలు, యుద్ధ విమానాలు, ఇతర సైనిక పరికరాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆయుధాలు, సైనిక పరికరాలు బల్క్ ప్రొడక్షన్ కోసం ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ కంపెనీకి అప్పగిస్తారు. కొన్నిసార్లు DRDO యొక్క ప్రయోగశాలలు కూడా ఈ సైనిక పరికరాలను ఉత్పత్తి చేస్తాయి.
