Jharkhand: జార్ఖండ్‌లో రెండు కేబుల్ కార్లు ఢీ కొన్నాయి. ఈ దుర్ఘ‌ట‌న‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 48 మంది రోప్‌వేపై 16 గంటల పాటు ఇరుక్కుపోయారు. భార‌త‌దేశంలోనే అతిఎత్తైన నిలువు రోప్‌వే అయిన త్రికూట్ రోప్‌వే లో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. 

Jharkhand: జార్ఖండ్‌లో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఆదివారం జార్ఖండ్‌లోని డియోఘర్ జిల్లాలో బాబా బైద్యనాథ్ ఆలయానికి సమీపంలోని త్రికుట్ కొండల వద్ద రోప్‌వేలోని కేబుల్ కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘ‌ట‌న‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 16 గంట‌ల పాట‌టు 48 మంది రోప్‌వేపై చిక్కుకుపోయార‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్ర‌మాదం కార‌ణంగా రోప్‌వేలోని కనీసం 12 క్యాబిన్‌లలో 48 మంది ఇంకా చిక్కుకుపోయారనీ, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న‌ద‌ని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. 

ఈ దుర్ఘ‌ట‌న ఆదివారం జ‌రిగిన‌ట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక లోపం కారణంగా కేబుల్ కార్లు ఢీకొనడంతో ఈ ఘటన జరిగినట్లు ప్రాథ‌మిక అంచ‌నా వేస్తున్నారు. దీనిపై విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని అధికారులు తెలిపారు. అయితే ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని ఒక అధికారి తెలిపారు. రెండు కేబుల్ కార్లు ఢీ కొన్న ప్ర‌మాదం త‌ర్వాత రోప్‌వే మేనేజర్ మరియు ఇతర ఉద్యోగులు అక్కడి నుండి పారిపోయారని స్థానిక వ‌ర్గాలు పేర్కొన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందాన్ని సంఘటనా స్థలానికి పంపినట్లు డియోఘర్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ భజంత్రీ తెలిపారు. ప్ర‌స్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొన‌సాగుతున్న‌ద‌ని తెలిపారు. 

DC మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుభాష్ చంద్ర జాట్ సంఘటనా స్థలం నుండి రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో స్థానిక గ్రామస్తులు కూడా ఎన్‌డిఆర్‌ఎఫ్‌కి సహాయం చేస్తున్నారని భజంత్రీ చెప్పారు. రెస్క్యూ ఆప‌రేష‌న్‌లో రెండు ఎంఐ-17 హెలికాప్ట‌ర్లు నిమ‌గ్న‌మైన‌ట్లు ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ అధికారులు వెల్ల‌డించారు. ఇక ఈ ప్ర‌మాదం నేప‌థ్యంలో కేబుల్ కార్ నుంచి దూకేందుకు ప్ర‌య‌త్నించిన ఇద్ద‌రు భార్యాభ‌ర్త‌లు తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని అధికారులు తెలిపారు. 

"ప్ర‌స్తుత పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు. కొంతమంది వ్యక్తులు ఇప్పటికీ రోప్‌వేలోని కేబుల్ కార్లలో ఇరుక్కుపోయారు. వారిని ర‌క్షించ‌డానికి చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. పర్యాటకులందరినీ సురక్షితంగా తరలిస్తున్నారు" అని డీసీ చెప్పారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) సిబ్బంది జార్ఖండ్‌లోని డియోఘర్‌లోని త్రికూట్ రోప్‌వే వద్ద రెస్క్యూ ఆపరేషన్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు 8 మందిని రక్షించారు. ఇంకా 40 మందిని రక్షించాల్సి ఉంది. ఈ ఘ‌ట‌నపై అన‌వ‌స‌ర‌ పుకార్లు వ్యాప్తి చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జార్ఖండ్ చీఫ్ సెక్రటరీ సుఖ్‌దేవ్ సింగ్‌లకు సమాచారం అందించామని, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను మోహరించాల్సిందిగా అభ్యర్థించామని గొడ్డ ఎంపీ నిషికాంత్ దూబే తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే గుర్తించినందుకు కేంద్ర హోంమంత్రికి కృతజ్ఞతలు అని ఆయన పేర్కొన్నారు. త్రికూట్ రోప్‌వే భారతదేశంలో ఎత్తైన నిలువు రోప్‌వే అని జార్ఖండ్ టూరిజం అధికారులు వెల్ల‌డించారు. బాబా బైద్యనాథ్ ఆలయానికి 20 కి.మీ దూరంలో ఉన్న రోప్‌వే 766 మీటర్ల పొడవు ఉండగా, 392 మీటర్ల కొండ ఎత్తులో ఉంది. రోప్‌వేలో 25 క్యాబిన్‌లు ఉన్నాయి. ఒక్కో క్యాబిన్‌లో నలుగురు కూర్చోవచ్చు.