West Bengal Cabinet Reshuffle:  బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని మంత్రివర్గంలో నేడు భారీ మార్పులు జ‌రిగాయి. ఈ త‌రుణంలో నూత‌నంగా తొమ్మిది మందికి స్థానం క‌ల్పించారు.

West Bengal Cabinet Reshuffle: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని మంత్రివర్గంలో నేడు భారీ మార్పులు జ‌రిగాయి. ఈ త‌రుణంలో నూత‌నంగా తొమ్మిది మందికి స్థానం క‌ల్పించారు. అలాగే.. బీజేపీ నుంచి టీఎంసీకి వచ్చిన బాబుల్‌ సుప్రియోను మంత్రివ‌ర్గంలోకి తీసుకున్నారు. వీరితో పాటు మరో ఎనిమిది మంది నేతలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. స్నేహసిస్ చక్రవర్తి, పార్థ భౌమిక్, ఉదయన్ గుహా, ప్రదీప్ మజుందార్, తజ్ముల్ హుస్సేన్, సత్యజిత్ బర్మన్ క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బిర్బాహా హన్స్దా, బిప్లబ్ రాయ్ చౌదరి స్వతంత్ర బాధ్యతలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

బెంగాల్ లో టీచ‌ర్ రిక్యూట్ మెంట్ కుంభకోణంలో సీనియర్ మంత్రి పార్థ ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేయడంపై TMC ప్రతిపక్షాల నుండి దాడికి గురవుతున్న సమయంలో మంత్రివర్గంలో ఈ పునర్వ్యవస్థీకరణ జరగ‌డం గ‌మ‌నార్హం. పార్థ ఛటర్జీ అరెస్ట్‌ తర్వాత ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించారు. పార్థ ఛటర్జీ పరిశ్రమలు, వాణిజ్యం, అండర్‌టేకింగ్,పార్లమెంటరీ వ్యవహారాలతో సహా ఐదు ముఖ్యమైన విభాగాలకు ఇన్‌ఛార్జ్‌గా వ్య‌వ‌హ‌రించారు.

టిఎంసి అధ్యక్షురాలు మమతా బెనర్జీ సోమవారం తన మంత్రివ‌ర్గంలో భారీ మార్పు చేసి, బుధవారం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని ప్రకటించారు. కొత్త కేబినెట్‌లో నలుగురైదుగురు కొత్త ముఖాలు ఉంటాయని, ఇప్పుడున్న మంత్రులనే పార్టీ పనిలో పెట్టుకుంటారని ఆమె చెప్పారు. కొంతమంది మంత్రుల శాఖలు కూడా మారవచ్చు.

ప్రస్తుతం మమత బెనర్జీ ప్రభుత్వంలో 21 మంది కేబినెట్ మంత్రులు, 10 మంది స్వతంత్ర బాధ్యతలు కలిగిన రాష్ట్ర మంత్రులు, తొమ్మిది మంది రాష్ట్ర మంత్రులు ఉన్నారు. అసెంబ్లీలో ఉన్న శాసనసభ్యుల సంఖ్య మేరకు రాష్ట్రంలో 44 మంది వరకు మంత్రులుగా నియమించే అవ‌కాశముంది.