చెన్నై: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ముస్లింలకు వ్యతిరేకం కాదని తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నారు. ఒక వేళ అది ముస్లింలకు వ్యతిరేకమైతే దానికి వ్యతిరేకంగా గళమెత్తడంలో తాను మొదటి వరుసలో ఉంటానని ఆయన అన్నారు. జాతీయ జనాభా నమోదు (ఎన్పీఆర్) అత్యవసరమని ఆయన అన్నారు. 

సిఏఏ ముస్లింలకు వ్యతిరేకం కాదని, దాని వల్ల ముస్లింలకు ముప్పు వాటిల్లితే, దానికి వ్యతిరేకంగా తానే తొలుత గొంతు ఎత్తుతానని ఆయన అన్నారు. విభజన తర్వాత బయటకు పంపించిన ముస్లింలు దేశంలో ఎలా ఉంటారని ఆయన ప్రశ్నించారు. 

రజినీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని చాలా కాలంగా అనుకుం్టూ వస్తున్నారు. వచ్చే ఏడాది తమిళనాడు శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయవచ్చునని అంటున్నారు. విషయాలను విశ్లేషించిన తర్వాత, ప్రొఫెసర్లతో చర్చించి మాట్లాడాలని ఆయన విద్యార్థులకు సూచించారు. 

సీఏఏకు సంబంధించి భారతీయులకు ఏ విధమైన సమస్య కూడా లేదని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను కొన్ని రాజకీయ పార్టీలు రెచ్చగొడుతున్నాయని ఆయన విమర్శించారు.

సిఏఏపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో చెలరేగిన హింస పట్ల రజినీకాంత్ డిసెంబర్ లో ఆవేదన వ్యక్తం చేశారు. హింస, అల్లర్లు సమస్యకు పరిష్కారం చూపలేవని ఆయన అన్నారు.