Asianet News TeluguAsianet News Telugu

2019 ఎన్నికలపై సీ-వోటర్ సర్వే: అధికారం బీజేపీదే.. రిమోట్ ప్రాంతీయ పార్టీలదే

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో మళ్లీ కేంద్రంలో ఏ పార్టీ, కూటమి అధికారంలోకి వస్తుందన్న దానిపై వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో  2019 సార్వత్రిక ఎన్నికలపై రిపబ్లిక్ టీవీ, సీ వోటర్ సంయుక్తంగా సర్వే నిర్వహించింది. 

c voter and republic tv survey on 2019 general elections
Author
Delhi, First Published Oct 5, 2018, 9:17 AM IST

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో మళ్లీ కేంద్రంలో ఏ పార్టీ, కూటమి అధికారంలోకి వస్తుందన్న దానిపై వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికలపై రిపబ్లిక్ టీవీ, సీ వోటర్ సంయుక్తంగా సర్వే నిర్వహించింది.

ఈ సర్వేలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే మరోసారి అధికారంలోకి వస్తుందని తేలింది. అయితే 2014లో లాగా ఈసారి కమలానికి సొంత మెజారిటీ రాదని స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 543 స్థానాలకు గానూ ఎన్డీయే కూటమికి 276 స్థానాలు, యూపీఏ కూటమికి 112 స్థానాలు లభించే అవకాశం ఉందని సర్వే తెలిపింది.

ప్రాంతీయ పార్టీలే ఎన్నికల్లోనూ.. ప్రభుత్వ ఏర్పాటులోనూ ప్రధాన పాత్ర పోషించనున్నాయని స్పష్టం చేసింది. ఈ పార్టీలన్నీ కలిసి 155 స్థానాలను కైవసం చేసుకుంటాయని అంచనా.. బీజేపీకి 2014 ఎన్నికల్లో 282 స్థానాలు రాగా.. ఎన్డీయే కూటమి మొత్తానికి కలిపి 335 స్థానాలు లభించాయి. అయితే ఈ సారి బీజేపీ సొంతంగా 230-240 స్థానాలను మాత్రమే కైవసం చేసుకునే అవకాశం ఉందని సర్వే తెలుపుతోంది. ఇక దేశంలోని కీలక రాష్ట్రాల్లో పరిస్థితిని చూస్తే.. 

ఉత్తరప్రదేశ్: దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 71 స్థానాలను గెలుచుకుని అధికారాన్ని ఏర్పాటు చేయడంలో ఈ రాష్ట్రమే కీలకపాత్ర పోషించింది.

అయితే ఈసారి ఎన్డీయేకి యూపీలో గడ్డు పరిస్థితి తప్పదంటోంది సర్వే. మహాఘట్‌బంధన్ పేరుతో ఎస్పీ, బీఎస్పీ ఏకమైతే బీజేపీ అడ్రస్ గల్లంతే అంటున్నారు. సర్వే ప్రకారం ఈ సారి 36 చోట్ల కమలం వికసించే అవకాశం కనిపిస్తోంది. ఎస్పీ, బీఎస్పీ కూటమికి 42 స్థానాలు లభించవచ్చు.. అయితే మహాకూటమి నుంచి బీఎస్పీ విడిపోయి ఒంటరిగా పోటీ చేస్తే కనుక బీజేపీ మళ్లీ 70 చోట్ల గెలుపొందవచ్చని సర్వే తెలుపుతోంది.

రాజస్థాన్: 2014 ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. మొత్తం 25 లోక్‌సభ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈసారి ముఖ్యమంత్రి వసుంధరా రాజేపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో బీజేపీకి 18 స్థానాలు మాత్రమే లభించే అవకాశమున్నట్లు సర్వే తెలిపింది.. మరోవైపు కాంగ్రెస్ పుంజుకుని 7 స్థానాల్లో గెలుపొందవచ్చట.

మధ్యప్రదేశ్: ఈ రాష్ట్రంలో మొత్తం 29 సీట్లు ఉన్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 27, కాంగ్రెస్ 2 చోట్ల గెలుపొందాయి. అయితే రైతు రుణాల మాఫీ, గిట్టుబాటు ధర వంటి అంశాల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో.. ఈసారి బీజేపీ 23 చోట్ల, కాంగ్రెస్ 6 చోట్ల గెలుపొందే అవకాశం ఉందని సర్వే తెలిపింది. 

బీహార్: మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌ ఇప్పుడు ఎన్డీయేకు కీలకంగా మారింది. ప్రస్తుతం నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. దీంతో అధిక స్థానాలను వదులుకుంటోంది. 2014లో బీజేపీ 22 చోట్ల .. కూటమిలోని ఎల్‌జేపీ 6 చోట్ల గెలిచాయి. అయితే ఈసారి జేడీయూ రాకతో ఎన్డీయే బలం పెరుగుతుందని సీవోటర్ తెలిపింది. ఆర్జేడీ, కాంగ్రెస్ ఇతర పార్టీలన్నీ కలిసి 9 చోట్ల గెలిచే అవకాశం ఉంది.

కర్ణాటక: కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలున్నాయి.. ఇక్కడ బీజేపీ 18 చోట్ల, కాంగ్రెస్ 7 స్థానాల్లో, జేడీఎస్ 3 చోట్ల గెలుస్తాయని సర్వే పేర్కొంది. 

పశ్చిమబెంగాల్: మమతకు తన అడ్డాలో ఈసారి కమలం నుంచి ఈసారి గట్టి ప్రతిఘటన ఎదురుకావొచ్చని సర్వే తెలుపుతోంది. మొత్తం 42 స్థానాలున్న బెంగాల్‌లో బీజేపీ 16 చోట్ల గెలిచే అవకాశం ఉంది. 2014లో 34 చోట్ల విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ ఈ సారి 25 చోట్ల మాత్రమే గెలుస్తుందని వెల్లడైంది.

తమిళనాడు: జాతీయ పార్టీలకు ఏనాడు స్థానం ఇవ్వని తమిళ ఓటర్లు ఈ సారి బీజేపీకి 2 స్థానాలను కట్టబెట్టవచ్చని సర్వే తెలిపింది. గత ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు గెలవని డీఎంకేకు ఈసారి 28 చోట్ల గెలిచే అవకాశం ఉందని.. అలాగే అన్నాడీఎంకే తన ప్రభను కోల్పోనుంది. ఆ పార్టీ కేవలం 9 స్థానాల్లో మాత్రమే గెలుస్తుందని సర్వే తెలిపింది.

గుజరాత్: బీజేపీకి కంచుకోట లాంటి గుజరాత్‌లో ఈ సారి కమలానికి ఎదురుగాలి వీయడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తం 26 స్థానాలను 2014లో బీజేపీ గెలుచుకుంది. అయితే ఈసారి పటేళ్ల ఉద్యమం కారణంగా రెండు చోట్ల కాంగ్రెస్ గెలిచే అవకాశం కనిపిస్తోంది. 

మహారాష్ట్ర: మొత్తం 48 స్థానాలున్న ఈ రాష్ట్రంలో బీజేపీ 2014లో 23 చోట్ల గెలవగా.. శివసేన 18, యూపీఏ 6 చోట్ల గెలిచాయి. అయితే ఈసారి తాము ఒంటరిగా పోటీ చేస్తామని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ప్రకటించడంతో బీజేపీకి గట్టిపోటీ తప్పదని భావిస్తున్నారు. కూటమి నుంచి విడిపోతే శివసేనకు నష్టం తప్పదని ఆ పార్టీ కేవలం 7 చోట్ల మాత్రమే గెలిచే అవకాశం ఉందని పేర్కొంది.. ఇది కాంగ్రెస్, ఎన్సీపీలకు ప్రయోజనం చేకూర్చి 19 సీట్లు కట్టబెట్టే ఛాన్స్ ఉందని తెలిపింది. 

ఒడిషా: నవీన్ పట్నాయక్ అడ్డాలో ఈసారి బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని సర్వే పేర్కొంది. మొత్తం 21 స్థానాల్లో బీజేపీ 12 చోట్ల, బీజేడీ 6 చోట్ల, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుస్తుందని వెల్లడించింది.

ఈశాన్య రాష్ట్రాలు: ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక ఎంపీ సీట్లున్న అస్సాంలో బీజేపీ తన స్థానాన్ని మెరుగుపరచుకోనుంది. 2014లో ఏడు సీట్లను గెలుచుకున్న కమలం.. ఈ సారి 9 చోట్ల విజయం సాధించే అవకాశం ఉందని.. కాంగ్రెస్ 4, స్వతంత్రులు ఒక చోట గెలిచే వీలుందని తెలిపింది. ఇక ఈశాన్య రాష్ట్రాల్లోని మిగిలిన 11 స్థానాల్లో ఎన్డీయే 9 చోట్ల, యూపీఏ 2 చోట్ల గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది. 

పంజాబ్‌లో మాత్రం ఎన్డీయేకు ఈసారి ఘోర పరాజయం తప్పదని సర్వే స్పష్టంగా చెప్పింది. అక్కడ అధికారంలో ఉన్న శిరోమణి అకాలీదళ్‌పై ఉన్న వ్యతిరేకత బీజేపీకి భారీ నష్టాన్ని మిగులుస్తుందని.. పంజాబ్‌లో ఒకే ఒక సీటు దక్కుతుందని సర్వే తెలిపింది.

కొన్నేళ్లుగా అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీకి ఎదురులేదని.. మొత్తం 11 చోట్లా బీజేపీ జయకేతనం ఎగురవేస్తుందని సీవోటర్ పేర్కొంది. కేంద్రపాలిత ప్రాంతాల్లో.. అండమన్, దాద్రానగర్ హవేలీ, ఛండీగఢ్, డయ్యూడమన్‌లలో ఉన్న ఒక్కో సీటును, దేశ రాజధాని ఢిల్లీలోని 7 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోనుంది.. అటు పుదుచ్చేరి, లక్ష్యద్వీప్‌లలోని ఒక్కో స్థానాన్ని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోనుందని రిపబ్లిక్ టీవీ-సీవోటర్ సర్వే పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios