పశ్చిమబెంగాల్ : పశ్చిమబెంగాల్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న అమిత్ షాకు ఆ రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 

అమిత్ షా ర్యాలీకి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ చివరి నిమిషంలో అనుమతి నిరాకరించింది. అంతేకాదు అమిత్ షా చాపర్ ల్యాండింగ్ కు ఇచ్చిన అనుమతిని కూడా వెనక్కి తీసుకుంది. గతంలో కూడా అమిత్ షా పర్యటనకు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. 

వరుసగా పశ్చిమబెంగాల్ లో అమిత్ షాకు చేదు అనుభవాలు ఎదురవ్వడంపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మే 19న ఎన్నికలు జరగనున్న జాధవ్‌పూర్‌లో అమిత్ షా సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. ఆకస్మాత్తుగా అనుమతులు వెనక్కి తీసుకోవడంపై బీజేపీ నిప్పులు చెరుగుతోంది. 

ఈసీ ఎందుకు మమత సర్కార్ పై చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేసింది. ఎన్నికల సంఘం వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అప్రజాస్వామిక చర్యల పట్ల ఈసీ మౌనం వహించడం సరికాదంటూ మండిపడ్డారు. 

ఈసీ స్పందించకపోతే తాము ఆందోళన చెపట్టాల్సి ఉంటుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు అనిల్ బాలు స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ లో అమిత్ షా పర్యటనకు అనుమతి నిరాకరించడం ఇది రెండోసారి. 

ఈ ఏడాది జనవరిలో అమిత్ షా మాల్దాలో దిగేందుకు ఆయన హెలికాప్టర్‌కు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఆ తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ , కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ వంటి కీలక బీజేపీ నేతల చాపర్ల ల్యాండింగ్ కు కూడా మమతా బెనర్జీ సర్కార్ అనుమతి ఇవ్వలేదు.