నేడు ఆరు రాష్ట్రాల్లోని ఏడు స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్ జరుగుతున్నది. ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్న సందర్భంలో ఈ పోటీ ఇండియా కూటమి తొలి పరీక్షగా మారింది. 

న్యూఢిల్లీ: ఈ రోజు ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలైంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఖాళీ ఏర్పడ్డ స్థానాలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఇండియా కూటమి ఎదుర్కొంటున్న తొలి పరీక్ష ఇది. అయితే.. పోటీ, సీట్లు కేటాయింపులపై ఇండియా కూటమి మధ్య ఒప్పందాలు ఇంకా పూర్తిస్థాయిలో ఖరారు కాలేదు. కాబట్టి, ఈ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో ఐక్యత కనిపించలేదు.

జార్ఖండ్‌లోని దుమ్రి, త్రిపురలోని బొక్సానగర్, ధన్‌పూర్, ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి, ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, కేరళలోని పుతుపల్లి, పశ్చిమ బెంగాల్‌లోని దూప్‌గురి స్థానాల్లో పోలింగ్ జరుగుతున్నది. ఈ స్థానాల్లో ఓట్లు లెక్కింపు సెప్టెంబర్ 8వ తేదీన జరగనుంది.

సీట్లవారీగా వివరాలు క్లుప్తంగా

ధూప్‌గురి (పశ్చిమ బెంగాల్): 2021లో బీజేపీ టికెట్ పై బిష్ణు పాద రాయ్ సుమారు 4,300 ఓట్ల స్వల్ప తేడాతో త్రిణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మితాలి రాయ్ పై గెలుపొందారు. బీజేపీ ఎమ్మెల్యే బిష్ణు పాద రాయ్ మరణించడంతో ఈ సీటు ఖాళీ అయింది. ఓడిపోయిన మితాలి రాయ్ ఇటీవలే బీజేపీలో చేరి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ, టీఎంసీ, కాంగ్రెస్-లెఫ్ట్‌ల మధ్య ముక్కోణపు పోటీ ఉన్నది. ఇటీవలే అమరుడైన సీఆర్పీఎఫ్ జవాన్ జగన్నాథ్ రాయ్ భార్య తాపసి రాయ్‌ బీజేపీ నుంచి పోటీకి దిగగా టీఎంసీ ప్రొఫెసర్ నిర్మల్ చంద్రను, సీపీఐ(ఎం) టీచర్ ఈశ్వర్ చంద్ర రాయ్‌ను బరిలోకి దింపింది. కాంగ్రెస్ ఈశ్వర్ చంద్ర రాయ్‌కు మద్దతు తెలుపుతున్నది.

ధన్‌పూర్, బొక్సానగర్ (త్రిపుర) : ధన్‌పూర్, బొక్సానగర్‌లో బీజేపీ, సీపీఎం పార్టీల మధ్య ముఖాముఖి పోటీ ఉన్నది. సీపీఎంకు మద్దతుగా కాంగ్రెస్, తిప్రా మోతాలు అభ్యర్థులను బరిలోకి దింపలేదు. కేంద్రమంత్రి ప్రతిమా భౌమిక్ ఎంపీ కావడానికి శాసన సభకు రాజీనామా చేయడంతో సీటు ఖాళీ అయింది. బొక్సానగర్ ఎమ్మెల్యే మిజన్ హుస్సేన్ మరణించడంతో ఆయన కొడుకు సామ్సన్ హక్‌ను సీపీఎం బరిలోకి దింపింది. మిజన్ హుస్సేన్ పై ఓడిపోయిన తఫజల్ హుస్సేన్‌ను బీజేపీ మరోసారి పోటి చేయిస్తున్నది.

బాగేశ్వర్ (ఉత్తరాఖండ్) : బాగేశ్వర్ సీటు కోసం ఐదుగురు సభ్యులు పోటీ పడుతున్నారు. ఇందులో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటీ ఉన్నది. బీజేపీ ఎమ్మెల్యే, క్యాబినెట్ మంత్రి చందన్ రామ్ దాస్ మరణించడంతో ఆయన భార్య పార్వతి దాస్‌ను బీజేపీ బరిలో నిలిపింది. చందన్ రామ్ దాస్ పై 12 వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ ఓడిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ బసంత్ కుమార్‌ను బరిలోకి దింపింది. సమాజ్‌వాదీపార్టీ, క్రాంతి దళ్, ఉత్తరాఖండ్ పరివర్తన్ పార్టీలు కూడా తమ అభ్యర్థులను నిలిపాయి.

దుమ్రి (జార్ఖండ్) : క్యాబినెట్ మంత్రి, జేఎంఎం ఎమ్మెల్యే జగన్నాథ్ మహతో మరణంతో ఈ ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎన్డీయే అభ్యర్థి యశోద దేవి ఏజేఎస్‌యూ టికెట్ పై బరిలోకి దిగగా బీజేపీ మద్దతు ఇస్తున్నది. ఇండియా కూటమి నుంచి జగన్నాథ్ మహతో భార్య బేబి దేవి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఏఐఎంఐఎం అభ్యర్థి అబ్దుల్ మొబిన్ రిజ్వి కూడా బరిలోకి దిగడంతో పోటీపై ఆసక్తి నెలకొంది.

పుతుపల్లి (కేరళ) : దిగ్గజ నేత ఉమెన్ చాందీ మరణంతో 53 ఏళ్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన పుతుపల్లి సీటు ఖాళీ అయింది. కాంగ్రెస్ కోటగానున్న పుతుపల్లిలో ఒకేసారి(1967లో) సీపీఎం గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్‌కు లెఫ్ట్ సారథ్యంలోని ఎల్‌డీఎఫ్‌కు మధ్య పోటీ ఉన్నది. యూడీఎఫ్ నుంచి ఉమెన్ చాందీ కడుకు చాందీ ఉమెన్ బరిలోకి దిగారు. ఎల్‌డీఎఫ్ నుంచి జాక్ సీ థామస్ ఆయనతో పోటీ పడుతున్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే నుంచి లిగిన్‌లాల్ కూడా పోటీలో ఉన్నారు.

ఘోసి (ఉత్తరప్రదేశ్) : ఘోసి సీటులో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్య గట్టి పోటీ ఉన్నది. ఎస్పీ ఎమ్మెల్యే దారా సింగ్ చౌహాన్ రాజీనామా చేసి బీజేపీలోకి మారడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. చౌహాన్‌నే బీజేపీ బరిలోకి దించింది. కాగా, సుధాకర్ సింగ్‌ను ఎస్పీ పోటీకి నిలిపింది. మంచి మెజార్టీ ఉన్న బీజేపీకి ఈ సీటు తప్పనిసరేమీ లేదు.