ఉప ఎన్నికల ఫలితాలు.. పశ్చిమ బెంగాల్ లో టీఎంపీ, జార్ఖండ్ లో జేఎంఎం విజయం..
జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ లోని అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. జార్ఖండ్ లోని డుమ్రీ నియోజకవర్గం నుంచి జేఎంఎం అభ్యర్థి బేబీ దేవి విజయం సాధించారు. అలాగే పశ్చిమ బెంగాల్ లోని ధూప్గురి నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థి నిర్మల్ చంద్ర రాయ్ గెలుపొందారు.

దేశంలోని ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఐదు స్థానాలకు ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో కేరళలోని పుత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి చాందీ ఊమెన్ గెలుపొందారు. అలాగే త్రిపురలోని రెండు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఇందులో బాక్సానగర్ లో తఫజల్ హుస్సేన్, ధన్పూర్ లో బిందు దేబ్ నాథ్ విజయం సాధించారు. తాజాగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ ఉప ఎన్నికలు ఫలితాలు కూడా వెల్లడయ్యాయి.
పశ్చిమ బెంగాల్ లోని ధూప్గురి అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో కాలేజీ ప్రొఫెసర్ అయిన టీఎంసీ అభ్యర్థి నిర్మల్ చంద్ర రాయ్ 4 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆయన తరువాత రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి అయిన తపసీ రాయ్ ఉన్నారు. ఆమె 2021లో జమ్ముకాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవాను భార్య. కాగా.. కాంగ్రెస్ బలపరిచిన సీపీఎం అభ్యర్థి ఈశ్వర్ చంద్ర రాయ్ మూడో స్థానంలో నిలిచారు.
ఈ విజయంపై తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. ధూప్గురి ప్రజలు ద్వేషం, మతోన్మాదం కంటే అభివృద్ధి రాజకీయాలను స్వీకరించారని అన్నారు. ‘‘ప్రజలతో మమేకం కావడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ప్రతి ఏఐటీసీ కార్యకర్తకు సెల్యూట్ చేస్తున్నాను. ధూప్గురి సర్వతోముఖాభివృద్ధికి మేం కట్టుబడి ఉన్నాం’’ అని ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు పెట్టారు.
నార్త్ బెంగాల్ యూనివర్శిటీలోని జల్పాయిగురి-2 క్యాంపస్ లో కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ జరిగింది. సెప్టెంబర్ 5న ఉప ఎన్నిక జరగ్గా.. 78 శాతం పోలింగ్ నమోదైంది. జూలై 25న బీజేపీ ఎమ్మెల్యే బిష్ణు పాద రాయ్ మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
కాగా.. జార్ఖండ్ లోని డుమ్రీ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అభ్యర్థి బేబీ దేవి విజయం సాధించారు. ఆమె ఎన్డీయే అభ్యర్థి యశోదాదేవిపై 17 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సెప్టెంబర్ 5న జరిగిన పోలింగ్ లో 64.84 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జేఎంఎం ఎమ్మెల్యే జగన్నాథ్ మహతో ఏప్రిల్ లో మరణించారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. ఆయన 2004 నుంచి ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.