హర్యానాలోని హిసార్ జిల్లా, హాన్సీ ప్రాంతంలో కొంతమంది గుర్తుతెలియని దుండగులు ఒక వ్యాపారవేత్తను అడ్డుకుని అతని నుండి రూ. 11 లక్షల నగదును దోచుకున్నారు. అంతటితో ఆగకుండా కారుకు నిప్పంటించడంతో అతను చనిపోయాడు. 

హన్సీలోని భట్ల-డేటా రోడ్‌లోని డేటా గ్రామంలో నివసిస్తున్న రామ్ మెహర్ మంగళవారం రాత్రి వ్యాపారం ముగించుకుని తన కారులో ఇంటికి వెళుతుండగా దొంగలు అతన్ని అడ్డగించారు. దాడిచేసి అతని దగ్గరున్న పదకొండు లక్షల రూపాయల నగదును దోచుకున్నారు. అంతటితో ఆగకుండా రామ్ మెహర్ ను బంధించి కారులో పడేశారు. 

కారుకు నిప్పంటించి దుండగులు పరారయ్యారు. రాత్రి పూట కావడంతో ఈ సంఘటనను ఎవరూ గమనించలేదు. దీంతో కారుతో పాటు రామ్ మెహర్ కూడా మాడి చనిపోయాడు. 

కారు అగ్నిప్రమాదానికి గురైందన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. నెంబర్ ప్లేట్ ఆధారంగా బాధితుడి బంధువులకు సమాచారం అందించారు. రామ్ మెహర్ కు బార్వాలాలో డిస్పోసబుల్ కప్పులు, ప్లేట్ల తయారీ కంపెనీ ఉంది. 

గుర్తు తెలియని వ్యక్తుల పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానికంగా ఉన్న సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను కనుక్కునే ప్రయత్నం చేస్తున్నామని హన్సీ పోలీసు ప్రతినిధి సుభాష్ తెలిపారు.

ఈ సంఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. అధికార బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా విరుచుకుపడ్డారు. హర్యానాలో జంగిల్ రాజ్ నడుస్తోందని మండిపడ్డారు. నడిరోడ్డులో వ్యాపారిని దోచుకుని, తగలబెట్టిన దిక్కులేదని ఎద్దేవా చేశారు.