ఓ మాజీ ఎంపీ తనను బెదిరించి తన ఆస్తంతా రాయించేసుకున్నాడని ఓ యువ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. అది కూడా పోలీసుల ఎదుటే తనకు అన్యాయం జరిగిందని రియల్ ఎస్టేట్ వ్యాపారి మోహిత్ జైస్వాల్ పేర్కొన్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... మోహిత్ జైస్వాల్ అనే వ్యాపారి ఇంటికి ఈ నెల 26వ తేదీన కొంతమంది వ్యక్తులు వచ్చి వ్యాపారం గురించి మాట్లాడాలని చెప్పి.. కారులో తీసుకువెళ్లి కిడ్నాప్ చేశారు. లక్నో నుంచి దాదాపు 316 కిలోమీటర్ల దూరంలో ఉన్న డియోరియా జైలుకు తీసుకుని వెళ్లారు.  ఆ తర్వాత జైలు కాంప్లెక్స్‌లో... సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ అతీఖ్‌ అహ్మద్‌తో మాట్లాడాలని మోహిత్ కి సూచించారు. 

అనంతరం ఆ యువకుడిని చంపేస్తామని బెదిరించి.. బలవంతంగా ఆస్తి మొత్తం రాయించుకున్నారు. జైలు సిబ్బంది ఎదుటే ఈ అన్యాయం జరగడం గమనార్హం. దీంతో.. బాధితుడు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. కాగా మోహిత్‌ జైస్వాల్‌ అనే వ్యక్తి జైలు కాంప్లెక్స్‌ లోపలికి వచ్చిన మాట వాస్తమేనని జైలు సిబ్బంది తెలిపారు. అయితే అతడు కిడ్నాప్‌ అయినట్టుగానీ, వారి మధ్య జరిగిన ఘర్షణ గురించి గానీ తమకు తెలియదని జైల్లోని సిబ్బంది పేర్కొన్నారు. 

ఈ క్రమంలో మోహిత్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, మీడియాతో గోడు వెళ్లబోసుకున్నాడు. ఈ నేపథ్యంలో 24 గంటల్లోగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి నివేదిక సమర్పించాల్సిందిగా యోగి ప్రభుత్వం డియోరియా జైలు ప్రధాన అధికారిని ఆదేశించింది. కాగా ఓ కేసులో అరెస్టైన మాజీ ఎంపీ అతీఖ్‌ అహ్మద్‌ ప్రస్తుతం డియోరియా జైలులో ఉన్నారు. గతంలో కూడా ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. మొత్తం 70 కేసుల్లో అతీఖ్‌కు, ఆయన అనుచరులకు సంబంధం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.