జమ్మూ కాశ్మీర్‌లో మరో ఘోర  రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజౌరి జిల్లాలో బస్సు లోయలో పడిన ఘటనలో ఐదుగురు మృతిచెందారని.. 12 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. 

జమ్మూ కాశ్మీర్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజౌరి జిల్లాలో బస్సు లోయలో పడిన ఘటనలో ఐదుగురు మృతిచెందారని.. 12 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. గురువారం సూరన్‌కోట్‌ పూంచ్‌ నుంచి జమ్మూకు వెళ్తున్న బస్సు మంజాకోట్‌ ప్రాంతంలోని డేరీ ర్యాలియోట్‌ వద్ద రోడ్డుపై నుంచి అదుపుతప్పి లోయలో పడిపోయిందని చెప్పారు. ఘటన స్థలంలో స్థానికులతో కలిసి భద్రతా బలగాలు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. గాయపడినవారిని ఆస్పత్రలకు తరలిస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో బుధవారం ఉదయం మినీ బస్సు లోయలో పడిన ఘటనలో కనీసం 12 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. మరో 26 మందికి గాయాలు అయ్యాయి. మినీ బస్సు గాలి మైదాన్ నుండి పూంచ్‌కు వెళ్తుండగా ఉదయం 8.30 గంటలకు సావ్జియాన్ సరిహద్దు బెల్ట్‌లోని బ్రారీ నల్లా సమీపంలో ప్రమాదానికి గురైంది. 100 అడుగుల లోతైన లోయలో బోల్తా పడింది. మినీ బస్సు ఓవర్ లోడ్‌తో వెళ్తుందని.. అందులో కొందరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. 

ఈ ఘటనలో మృతిచెందినవారిలో ఇద్దరు మైనర్ బాలురు, ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంపై పూంచ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ బస్కోత్రా మాట్లాడుతూ.. “మినీ బస్సులో ఓవర్‌లోడ్ ఉంది. ఇందులో సీటింగ్ కెపాసిటీ 28 ఉంది.. కానీ అందులో 38 మంది ప్రయాణిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురు ప్రయాణికులను మెరుగైన చికిత్స కోసం విమానంలో జమ్మూలోని ఆసుపత్రికి తరలించారు. మరికొందరిని రోడ్డు మార్గంలో జమ్మూకు పంపుతున్నారు’’ అని చెప్పారు.