Asianet News TeluguAsianet News Telugu

స్టాప్‌లో బస్సు ఆగలేదని ప్యాసింజర్ పిటిషన్.. రూ. 8 వేల పరిహారం చెల్లించాలని ఆర్టీసీకి కోర్టు ఆదేశాలు

ఆ ఆర్టీసీ బస్సు ఆగాల్సిన స్టాప్‌లో కాకుండా అర కిలోమీటర్ దూరంలో ఆగింది. దీంతో అసౌకర్యానికి గురైన ఆ మహిళా ప్యాసింజర్ ఆర్టీసీపై కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆమెకు రూ. 8వేల పరిహారం చెల్లించాల్సిందిగా ఆర్టీసీని ఆదేశించింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
 

bus not halted at stop woman passenger demand compensation, court orders same
Author
Bengaluru, First Published Sep 3, 2021, 5:25 PM IST

బెంగళూరు: ఓ ఆర్టీసీ బస్సు.. స్టాప్‌లో ఆపకుండా అరకిలోమీటర్ దూరంలో ఆగింది. దీంతో ఆ మహిళా ప్యాసింజర్‌కు ఇల్లు చేరడం కష్టమైంది. తనకు కలిగిన అసౌకర్యానికి ఆమె వినియోగదారుల కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన కోర్టు ఆర్టీసి తీరును తప్పుబట్టింది. ఆమెకు రూ. 8వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కర్ణాటకలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తుమకూరు జిల్లా ఉర్దిగెరె హుబ్లీకి చెందిన విజయ బాయి కర్ణాటక ఆర్టీసీపై ఫిర్యాదు చేశారు.

విజయబాయి కర్ణాటక ఆర్టీసీ ఎక్కి బెంగళూరు నుంచి తుమకూరు శివారులోని హెచ్‌ఎంటీ బస్ స్టాప్‌కు టికెట్ తీసుకున్నారు. కానీ, ఆ బస్సు హెచ్ఎంటీ స్టాప్ దగ్గర ఆగలేదు. ఆమె స్వయంగా బస్సును ఆపాల్సిందిగా కోరగా స్టాప్‌కు 400 మీటర్ల దూరంలో ఆపారు. అక్కడ బస్సు దిగిన తర్వాత రోడ్డు మధ్యలో బారికేడ్లు ఉండటంతో దాటడం కష్టమైంది. దీంతో ఆమె రెండు ఆటోలు పట్టుకుని తిరిగి లక్ష్యానికి చేరాల్సి వచ్చింది. ఇందులో రూ. 10, రూ. 50లు ఆటోలకు చెల్లించారు.

పరిహారం కోసం విజయ బాయి ఆర్టీసీ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే ఫలితం లేకపోయింది. దీంతో తుమకూరు జిల్లా వినియోగదారుల వివాదాలు, పరిష్కారాల కమిషన్‌ను ఆశ్రయించారు. ఆర్టీసీ సేవల్లో లోపాన్ని పేర్కొంటూ ఆమె 2019 జులై 29న వినియోగదారుల కోర్టులో పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్ విచారించిన కోర్టు ఆర్టీసీ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఆమెకు కలిగిన అసౌకర్యానికిగాను ఆర్టీసీ రూ. 10వేల పరిహారం చెల్లించాలని, లిటిగేషన్ ఖర్చు కింద మిత్తితోపాటు రూ. 5వేలను చెల్లించాలని, అంతేకాదు, ఆటోకు ఆమె చెల్లించిన పది రూపాయాలూ అందజేయాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుపై ఆర్టీసీ వాదనలు వినిపించింది. విజయ బాయి ఎక్కిన బస్సు నాన్ స్టాప్ బస్సు అని, దానికి పరిమిత సంఖ్యలోనే స్టాప్‌లు ఉంటాయని వాదించింది. మధ్యలో బస్సు ఆపాల్సిందిగా డిమాండ్ చేయడానికి లేదని తెలిపింది. ఈ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. కానీ, విజయ బాయికి హెచ్ఎంటీ స్టాప్ కోసం టికెట్ ఇచ్చారని, టికెట్ ఇచ్చిన స్టాప్ దగ్గరే ఆమెను ఎందుకు దింపలేదని ప్రశ్నించింది. అలాగే, పరిహారాన్ని రూ. 8,010కు కుదించింది. వీటిని 60 రోజుల్లో పిటిషనర్‌కు అందజేయాలని ఆదేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios