Heartfelt: 1984లో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దారుణ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో ఎయిమ్స్ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ పి.వేణుగోపాల్ నాలుగు గంటల ఇందిరా చివరి క్షణాలను తన పుస్తకంలో వివరించారు. ఆమె శరీరాన్ని ఛిద్రం చేసిన బుల్లెట్లు.. రక్తంతో తడిచిన దుస్తులతో ఆస్పత్రి బెడ్‌పై పడి ఉండటాన్ని చూసి వణికిపోయానని ఎయిమ్స్ మాజీ డైరెక్టరు తాను రాసిన ‘హార్ట్‌ఫెల్ట్’ పుస్తకంలో పేర్కొన్నారు.
Former PM Indira Gandhi: 1984లో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దారుణ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో ఎయిమ్స్ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ పి.వేణుగోపాల్ నాలుగు గంటల ఇందిరా చివరి క్షణాలను తన పుస్తకంలో వివరించారు. ఆమె శరీరాన్ని ఛిద్రం చేసిన బుల్లెట్లు.. రక్తంతో తడిచిన దుస్తులతో ఆస్పత్రి బెడ్‌పై పడి ఉండటాన్ని చూసి వణికిపోయానని ఎయిమ్స్ మాజీ డైరెక్టరు తాను రాసిన ‘హార్ట్‌ఫెల్ట్’ పుస్తకంలో పేర్కొన్నారు.
వివరాల్లోకెళ్తే.. 31 అక్టోబర్ 1984 ఉదయం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కొత్త డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించబోతున్నప్పుడు, అకస్మాత్తుగా ఏమి జరిగిందో ఎవరూ ఊహించి ఉండరు. కొద్దిసేపటికే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని శరీరం మొత్తం బుల్లెట్లతో.. రక్తంతో తడిచిన దుస్తులతో అక్కడికి తీసుకొచ్చారు. మాటల్లో వర్ణించలేని నిస్పృహ, గందరగోళ వాతావరణం ఆసుపత్రిలో నెలకొంది. శ్రీమతి గాంధీకి శస్త్రచికిత్స చేసి, ఆమె శరీరం నుండి బుల్లెట్లను తొలగించిన డాక్టర్ పీ.వేణుగోపాల్ ఆ భయంకరమైన రోజును నేటికీ మరచిపోలేదంటూ.. తాను రాసిన ‘హార్ట్‌ఫెల్ట్’ పుస్తకంలో ఇందిరా గాంధీ చివరి క్షణాలను గుర్తుచేసుకున్నారు. ఎయిమ్స్ వైద్యులు, సర్జన్లు, నర్సింగ్ సిబ్బంది ఆమె రక్షించడానికి అవిశ్రాంతంగా శ్రమించిన నాలుగు గంటల గురించి ఆయన ప్రస్తావించారు.
వేణుగోపాల్ అప్పుడు ఎయిమ్స్ లో గుండె శస్త్రచికిత్స విభాగానికి అధిపతిగా ఉన్నారు. 1994 ఆగస్టులో భారతదేశంలో మొదటి గుండె మార్పిడి చేసిన రికార్డు ఆయన సొంతం. ‘హార్ట్‌ఫెల్ట్’ పుస్తకం ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ గత వారం విడుదల చేశారు. ఈ పుస్తకంలో ఇందిరాగాంధీ గురించి వివరిస్తూ.. రక్తంతో తడిసిన చీర నుంచి నేలపై బుల్లెట్లు పడటం, 'ఓ-నెగెటివ్' రక్తం అందించడం గురించి చేస్తున్న ప్రయత్నాలు ,తదుపరి ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమంపై ఆసుపత్రి కారిడార్ లో రాజకీయ చర్చ... ముప్పై తొమ్మిదేళ్ల తర్వాత కూడా నాకు అన్నీ స్పష్టంగా గుర్తున్నాయంటూ ఆయన పేర్కొన్నారు. "మంచం మీద ఆ సన్నని శరీరాన్ని చూసి నేను చలించిపోయాను.. కడుపులో రక్తస్రావం కావడంతో ఆమె పూర్తిగా రక్తంతో తడిసిపోయింది. ముఖం పాలిపోయి, శరీరం నుంచి రక్తం మొత్తం బయటకు వచ్చినట్లు... రక్తం వేగంగా ప్రవహిస్తోంది, చుట్టూ రక్తపు మడుగుల పరిస్థితులు ఏర్పడ్డాయి" అని పేర్కొన్నారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఆమె నివాసంలోని పరిసరాలలో ఆమె సొంత సెక్యూరిటీ గార్డులు హత్య చేశారు. దుండగులు ఆమెపై 33 బుల్లెట్లు ప్రయోగించగా, అందులో 30 బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోయాయి. శరీరంలో ఏడు బుల్లెట్లు ఉండగా, మిగతా 23 శరీరం చీల్చుకుంటూ పోఆయి. "వారు (వైద్యులు) గాంధీకి ఓ-నెగటివ్ రక్తం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని నేను చూశాను. ఈ గ్రూపు రక్తం అంత సులభంగా దొరకదు, కానీ ఈ ప్రయత్నం పనికిరాదని నేను చూశాను, ఎందుకంటే రక్త మార్పిడితో పాటు, బుల్లెట్ నిండిన ఆమె శరీరం నుండి రక్తం అంతే వేగంగా బయటకు ప్రవహిస్తోంది. ఎయిమ్స్ సిబ్బంది పెద్ద ఎత్తున గుమిగూడారు. నేను వెంటనే పదవీ విరమణ చేయబోతున్న డైరెక్టర్ టాండన్, కొత్తగా బాధ్యతలు తీసుకోబోతున్న స్నేహ్ భార్గవ్ వద్దకు వెళ్లా. వారిద్దరూ నిస్సహాయంగా కనిపించారు. వారికి ఏం చేయాలో అర్థం కాలేదని తెలుస్తోంది. ఆ రోజు డైరెక్టర్ ఎవరనే అనిశ్చితి, నిర్ణయాలు, చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఇద్దరూ మౌనంగా ఉండి, ఏం చెయ్యాలి అని అడుగుతున్నట్టు నా వంక చూశారని" పేర్కొన్నారు.
గుండె శస్త్రచికిత్స విభాగాధిపతిగా తనను చూసి వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వేణుగోపాల్ చెప్పారు. "... రక్తస్రావం ఆపడానికి ఓటీ (ఆపరేషన్ థియేటర్)కి తీసుకెళ్లాలని ఆదేశించాను. ప్రతిదీ చాలా త్వరగా చేయవలసి వచ్చింది, నేను సంతకం చేసిన సమ్మతి పత్రం కోసం కూడా వేచి ఉండకుండా ముందుకు సాగాను. ... కానీ కాపాడలేకపోయారు. ముందుగా బైపాస్ యంత్రం సహాయంతో ఇందిరాగాంధీ శరీరం నుంచి ప్రవహిస్తున్న రక్తాన్ని ఆపి, బుల్లెట్లతో నిండిన కడుపులోకి రక్తం ప్రవహించకుండా కిందికి దిగుతున్న అయోర్టాను మూసివేయాలి. నాలుగు గంటల పాటు కష్టపడ్డారు. స్క్రబ్ రక్తంతో తడిసిపోవడంతో మూడుసార్లు ఓటీ స్క్రబ్ మార్చాల్సి వచ్చిందని వేణుగోపాల్ గుర్తు చేసుకున్నాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో బైపాస్ మెషీన్ నుంచి ప్రధానిని బయటకు తీసేందుకు ప్రయత్నించినా కాపాడలేకపోయారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాజీవ్ గాంధీకి చెప్పడానికి బయటకు వచ్చినప్పుడు తన నోటివెంట మాటలు రాలేదని వేణుగోపాల్ తన పుస్తకంలో వివరించారు.
