కొన్నేళ్ల క్రితం పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని నెలలపాటు జరిగిన ఉద్యమానికి కేరాఫ్‌గా ఢిల్లీలోని షహీన్‌బాగ్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా, ఆ షహీన్‌బాగ్‌లోకి బుల్డోజర్లు, జేసీబీలు ఎంటర్ అయ్యాయి. అక్కడ అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ చేపడుతున్నట్టు అధికారులు చెప్పారు. దీంతో స్థానికులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. కానీ, పోలీసులు వారిని అడ్డుకుంటూ బుల్డోజర్లను ముందుకు తీసుకుపోతున్నారు.
న్యూఢిల్లీ: షహీన్‌బాగ్ పేరు గుర్తు ఉన్నదా? పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన భీకర ఆందోళనకు కేరాఫ్ అడ్రస్. దేశ రాజధాని నడిబొడ్డున షహీన్‌బాగ్ కేంద్ర ప్రభుత్వానికి అప్పుడు కంటగింపుగా కనిపించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చిన్నా పెద్దా, ఆడ మగ, మతం, కులం అన్నింటికీ అతీతంగా స్థానికులు, ఇతరులు అక్కడ నిరసనలు చేశారు. వారి ప్రదర్శనను నీరుగార్చడానికి పలువురు అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలతో షహీన్‌బాగ్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు ఆ షహీన్‌బాగ్‌లో ‘అక్రమ కట్టడాల కూల్చివేత డ్రైవ్’ చేపట్టడానికి బుల్డోజర్లు సిద్ధం అయ్యాయి. అయితే, పోలీసులు అక్కడి వ్యాపారులతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా ఈ ప్రక్రియను నిలిపారు.
దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది. ఇటీవలే ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా దక్షిణ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌కు ఓ లేఖ రాశారు. రొహింగ్యాలు, బంగ్లాదేశీలు, జాతి వ్యతిరేక శక్తులు కబ్జా చేసుకుని చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని ఏప్రిల్ 20వ తేదీన లేఖ రాశారు. ఈ లేఖ తర్వాత దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఈ డిమోలిషన్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5వ తేదీన ఈ డ్రైవ్ చేపట్టాలని భావించింది. కానీ, సరిపడా పోలీసు బలగాల మోహరింపు సాధ్యం కాకపోవడంతో వాయిదా వేసింది. ఈ రోజు భారీగా పోలీసులతోపాటు మున్సిపల్ అధికారులు షహీన్‌బాగ్‌కు వెళ్లారు. వారి వెంటే బుల్డోజర్లు, జేసీబీలు షహీన్‌బాగ్‌కు చేరాయి.
షహీన్‌బాగ్‌లో అక్రమ కట్టడాలు లేవని, భూమిని కబ్జా చేసుకుని నిర్మించినవేమీ లేవని స్థానికులు చెబుతున్నారు. బుల్డోజర్లను, అధికారులను అడ్డుకుంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. వారితోపాటే స్థానికుల కూడా ఆందోళనలకు కూర్చున్నారు. కానీ, పోలీసు బలగాలు సరిపడా ఉండటంతో కాంగ్రెస్ కార్యకర్తలను తొలగించారు.
రోడ్ నెంబర్ 13లో ఎలాంటి అక్రమ నిర్మాణాలు లేవని కౌన్సిలర్ వాజిబ్ తెలిపారు. ఈ రోడ్డు సీపీడబ్ల్యూడీది అని, దీనికి ఎంసీడీతో సంబంధమే లేదని వాదించారు. ప్రజలు తమ ఇళ్ల ముందరి రోడ్ల పక్కన ప్రాంతాన్ని ఖాళీగానే ఉంచారని చెప్పారు. కాగా, ఆప్ నేత, ఓక్లా ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ స్పాట్‌కు చేరారు. ఈ అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగించడానికే ఉద్దేశపూర్వకంగా చేపడుతున్నారని ఆరోపించారు.
కాగా, దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషణ్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ రాజ్‌పాల్ మాట్లాడుతూ, మున్సిపల్ తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుందని, తమ అధికారులు, బృందాలు, బుల్డోజర్లు అన్ని సిద్ధంగా ఉన్నాయని అన్నారు. అక్రమ కట్టడాలు ఎక్కడున్నా సరే.. అవి తుగ్లకాబాద్, సంగమ్ విహార్, న్యూ ఫ్రెండ్స్ కాలనీ, లేద షహీన్‌బాగ్‌లో ఉన్నా సరే వాటిని తొలగించి తీరుతామని తెలిపారు.
ఈ అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ చేపట్టడానికి సరిపడా పోలీసు బలగాలు అవసరం అని దక్షిణ ఢిల్లీ మేయర్ ముకేష్ సూర్యన్ తెలిపారు. ఈ డ్రైవ్‌కు ఢిల్లీ వాసుల మద్దతు ఉన్నదని వివరించారు. కాగా, స్థానికులు కొందరు తాము సరైన డాక్యుమెంట్లు చూపెట్టినప్పటికీ అధికారులు చూడటానికి ఇష్టపడట్లేదని, డిమోలిషన్ డ్రైవ్ ముందుకు తీసుకుపోవడానికే పూనుకున్నారని ఆరోపించారు.
ఢిల్లీలోని జహంగిర్‌పురిలో హనుమాన్ జయంతి రోజున మతపరమైన ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల తర్వాతే జహంగిర్‌పుర్‌లో ఇలాగే అక్రమ నిర్మాణాల తొలగింపు పేరిట డ్రైవ్ ప్రారంభమైంది. మత ఘర్షణలకు ప్రధాన కేంద్రంగా ఉన్న మసీదు సమీపంలోని నిర్మాణాలను నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే.
