కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్మాణంలో ఉన్న ఓ నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు దుర్మరణం పాలవ్వగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే.. నగరంలోని పులకేశి నగర్ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం నిర్మాణంలో ఉంది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఈ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటి వరకు ఎనిమిది మందిని శిథిలాల నుంచి వెలికి తీశారు.

వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే మూడో అంతస్తులో ఏడుగురు కార్మికులు కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటున్నారని.. వారంతా శిథిలాల కింద చిక్కుకుని ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

వారిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. వీరంతా ఉత్తరాదికి చెందిన కార్మికులని స్థానికులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పక్కనే ఉన్న మరో భవనం కూడా పాక్షికంగా దెబ్బతింది.