బెంగుళూరు:కర్ణాటక సీఎం యడియూరప్ప కూడ ఏపీ సీఎం వైఎస్ జగన్ బాటలోనే పయనిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రజలకు ఉద్యోగావకాశాల్లో సింహాభాగం వాటా దక్కాలన్నారు.

గురువారం నాడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో  సీఎం యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలనే స్థానికులకు 75 శాతం ఉద్యోగావకాశాలను కల్పించనున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత అదే బాటలో యడియూరప్ప వ్యాఖ్యలు ఉన్నాయి.

తమ ప్రభుత్వం కన్నడ ప్రజల సెంటిమెంట్ ను గౌరవిస్తుందని ఆయన చెప్పారు.ఉపాధి అవకాశాల్లో కన్నడ ప్రజల ఆత్మగౌరవం, ఉద్యోగ అవకాశాలకు కట్టుబడి ఉన్నట్టుగా ఆయన ప్రకటించారు.

అదే సమయంలో  కర్ణాటక రాష్ట్రంలో ఉపాధి కోసం వచ్చే వారికి తాము సమాన అవకాశాలను కూడ కల్పిస్తామని  యడియూరప్ప స్పష్టం చేశారు.

జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు కూడ దేశంలో ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయని  ఆయన చెప్పారు.  కాశ్మీర్ దేశానికి  కిరీటం వంటిదని ఆయన తెలిపారు.