సారాంశం

మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీఎస్పీ చీఫ్ మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్‌లలోనూ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కోటా ఉండాలని సూచించారు. అలాగైతేనే వారికి న్యాయం దక్కుతుందని తెలిపారు.
 

న్యూఢిల్లీ: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన తరుణంలో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కీలక సూచనలు చేశారు. మహిళా రిజర్వేషన్‌లలోనూ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు వేర్వేరుగా కోటా ఉండేలా చూసుకోవాలని సూచించారు. అలాగైతేనే.. ఈ రిజర్వేషన్ లక్ష్యం నేరవేరుతుందని వివరించారు.

‘బీఎస్పీ సహా చాలా పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సానుకూలంగా ఓటేస్తాయి. ఈ బిల్లుపై చర్చ జరిగిన తర్వాత గతంలో మాదిరిగా పెండింగ్‌లో కాకుండా ఈ సారి ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నాను. మహిళలకు ప్రతిపాదిత 33 శాతం రిజర్వేషన్లు కాదు.. 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. మహిళల జనాభాను దృష్టిలో పెట్టుకుని వారికి 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని గతంలోనూ నేను నా పార్టీ తరఫున పార్లమెంటులో మాట్లాడాను. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని ఆలోచిస్తుందని ఆశిస్తున్నాను. మహిళలకు ఇచ్చే రిజర్వేషన్లలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు సెపరేట్ కోటా ఉండాలి. అలాగైతేనే వారికి న్యాయం దక్కుతుంది’ అని మాయావతి అన్నారు.

Also Read: మహిళా రిజర్వేషన్ బిల్లు ..కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర మంత్రి వర్గం సోమవారం క్లియర్ చేసింది. ఈ రోజు పార్లమెంటులో ఈ బిల్లును కేంద్ర న్యాయ శాఖ మంత్రి రామ్ మేఘవాల్ ప్రవేశపెట్టారు.