బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు షాక్ ... ఇక వారి జాబ్స్ ఊడినట్లేనా?
భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ మరోసారి ఉద్యోగులను సాగనంపే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం వాలంటిరీ రిటైర్మెంట్ స్కీం ను మరోసారి ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది.
BSNL : కేంద్ర ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఇప్పటికే ఓసారి వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ను అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే మరోసారి ఉద్యోగుల సంఖ్యను తగ్గించి ఖర్చులను తగ్గించుకునేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే విఆర్ఎస్ 2.0 కు సిద్దమయ్యింది. ఇందుకోసం ఇప్పటికే టెలి కమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్ కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి కూడా తీసుకునే ప్లాన్ లో వుందని తెలుస్తోంది. ఇదే జరిగినే బిఎస్ఎన్ఎల్ లో భారీ ఉద్యోగాల కోత తప్పదు.
ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ కేవలం ఉద్యోగుల జీతాల కోసమే రూ.7500 కోట్లు ఖర్చు చేస్తోంది... ఇది ఆ సంస్థ రెవెన్యూలో 38%. ఈ భారాన్ని తగ్గించుకునేందకు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు సంఖ్యను 18,000 నుండి 19,000 వేలకు తగ్గించుకునే ప్రయత్నిస్తోంది. ఇలా విఆర్ఎస్ ద్వారా ఉద్యోగులను తగ్గించుకోవడం ద్వారా ఏడాదికి రూ.5000 కోట్లలోపు భారం మాత్రమే పడనుంది. ఈ విఆర్ఎస్ కు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపితే కేబినెట్ ముందుకు వెళుతుంది... అక్కడ కూడా గ్రీన్ సిగ్నల్ లభిస్తే ఇక బిఎస్ఎన్ఎల్ లో ఉద్యోగాలు ఊడిపోవడం ఖాయం అవుతుంది.
విఆర్ఎస్ తీసుకునే ఉద్యోగులకు ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బు చెల్లిస్తారు. ఇందుకోసం బిఎస్ఎన్ఎల్ ఆర్థిక శాఖను రూ.1500 కోట్లు కోరినట్లు తెలుస్తోంది. బిఎన్ఎన్ఎల్ బోర్డ్ ఈ మేరకు ప్రతిపాదనలు పంపింనట్లు... ఇందుకు టెలీకమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్ కూడా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఇది భారీ ఆర్థిక వ్యవహారాలతో కూడుకున్న విషయం కాబట్టి ఆర్థిక శాఖ దీనిపై తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.
ఇటీవల ప్రైవేట్ టెలికాం కంపనీలు రీచార్జ్ ధరలు పెంచడంతో బిఎస్ఎన్ఎల్ లాభపడింది. ఈ ప్రభుత్వ రంగ టెలికాం కంపనీకి భారీగా వినియోగదారులు పెరిగారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 4G సేవలు విస్తరించి వినియోగదారులకు మరింత దగ్గరయ్యేందుకు బిఎస్ఎన్ఎల్ ప్రయత్నిస్తోంది. ఇలాంటి కీలక సమయంలో ఉద్యోగాల కోత నిర్ణయం సంచలనంగా మారింది. అయితే విఆర్ఎస్ కు సిద్దమైన బిఎస్ఎన్ఎల్ బోర్డ్ సోమవారం దీనికి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ఇప్పటికయినా ఈ విఆర్ఎస్ 2.0 పై బిఎస్ఎన్ఎల్ లో అంతర్గత చర్చలు మాత్రమే జరుగుతున్నాయి... అధికారిక సమాచారమేమీ వెలువడలేదు.
గతంలో విఆర్ఎస్ ఎలా జరిగింది :
ఈ ఫైనాన్సియల్ ఇయర్ 2024 లో బిఎస్ఎన్ఎల్ రెవెన్యూ రూ.21,302 కోట్లకు చేరింది. గత సంవత్సరంతో పోలిస్తే ఆదాయం కాస్త మెరుగుపడింది. అయితే ప్రస్తుతం ఈ ప్రభుత్వరంగ టెలికాం సంస్థలో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు 30,000, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు 25,000 మంది పనిచేస్తున్నారు.
అయితే 2019 లో కేంద్ర ప్రభుత్వం రూ. 69,000 కోట్ల బిఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ ప్రణాళికను ఆమోదించింది. ఈ క్రమంలోనే బిఎస్ఎన్ఎల్ తో పాటు ఎంటిఎన్ఎల్ (మహానగర్ టెలికాం నిగమ్) ఉద్యోగులకు విఆర్ఎస్ (ముందస్తు పదవీ విరమణ) స్కీమ్ కూడా వుంది. 93,000 మంది విఆర్ఎస్ ఎంచుకున్నారు. వీరికి విఆర్ఎస్ కింద అందించే ఆర్థిక సాయంతో పాటు పెన్షన్, గ్రాట్యుటీలు, కమ్యుటేషన్ కోసం సుమారు రూ. 17,500 కోట్లు ఖర్చు చేసారు.
ఇక 2022 లో కేంద్ర ప్రభుత్వం మరోసారి బిఎస్ఎన్ఎల్ పునరుద్దరణ కోసం రూ.1.64 లక్షల కోట్లు ఆమోదించింది. ఇక 2023 లో మరోసారి రూ.89,000 కోట్లు కేటాయించారు. ఈసారి దేశవ్యాప్తంగా 4G, 5G సేవల విస్తరణతో పాటు వినియోగదారులకు మరింత చేరువయ్యేలా డాటా ప్లాన్స్ రూపకల్పన, ఇతర సౌకర్యాల కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేసేందుకు ఈ మొత్తాన్ని కేటాయించారు.