గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలోని క్రీక్ ప్రాంతంలో అక్ర‌మ చొర‌బాటుకు ప్ర‌య‌త్నించిన ఓ పాకిస్థాన్ జాతీయుడిని, మూడు ఫిషింగ్ బోట్‌లను బీఎస్ఎఫ్ బ‌ల‌గాలు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు బీఎస్ఎఫ్ ఒక ప్రకటన విడుదల చేసింది. 

గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలోని క్రీక్ ప్రాంతంలో అక్ర‌మ చొర‌బాటుకు ప్ర‌య‌త్నించిన ఓ పాకిస్థాన్ జాతీయుడిని, మూడు ఫిషింగ్ బోట్‌లను బీఎస్ఎఫ్ బ‌ల‌గాలు అదుపులోకి తీసుకున్నారు. బీఎస్ఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం గుజరాత్‌లోని కచ్ జిల్లా గల్ఫ్ ప్రాంతం నుంచి ఇండో-పాకిస్తాన్ సముద్ర సరిహద్దులో బీఎస్ఎఫ్ గస్తీ కాస్తోంది. ఈ స‌మ‌యంలో ఓ పాకిస్థాన్ జాతీయుడిని పట్టుకున్నారు. అలాగే మూడు ఫిషింగ్ బోట్లను గుర్తించారు. ‘‘ గల్ఫ్ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు నలుగురైదుగురు మత్స్యకారులను తీసుకెళ్తున్న పాకిస్తాన్ ఫిషింగ్ బోట్ల యాక్టివిటీని BSF గమనించింది. వారు అల్లకల్లోలంగా ఉన్న సముద్ర పరిస్థితులను ఉపయోగించుకుని భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని బీఎస్ఎఫ్ ప్రకటన విడుదల చేసింది. 

బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ బోట్లను చూసి పాక్ చొరబాటుదారులు పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే వారిని బలగాలు వెంబడించాయి. ఇందులో ఓ పాకిస్థానీ జాలరిని పట్టుకుంది. అతడికి సంబంధించిన మూడు పడవలను స్వాధీనం చేసుకుంది. ఆ ప్రాంతం అంతా బురదమయంగా ఉండ‌టంతో మిగిలిన మత్స్యకారులు పారిపోయార‌ని ఆ ప్ర‌క‌ట‌న పేర్కొంది. స్వాధీనం చేసుకున్న మూడు బోట్లను సోదాలు చేయగా అందులో అనుమాన‌స్పదంగా ఏమీ క‌నిపించ‌లేదు. ఈ ప్రాంతంలో ఇంటెన్సివ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామ‌ని ఇప్ప‌టి వ‌ర‌కు అనుమానాస్పదంగా ఏమీ గుర్తించ‌లేదని బీఎస్ఎఫ్ ప్ర‌క‌టించింది. 

ఇది ఇలా ఉండ‌గా..గ‌త నెల 8వ తేదీన భారతదేశానికి చెందిన సముద్ర జలాల్లో ఉన్న పాక్ ఓ బోట్ ను ఇండియ‌న్ కోస్ట్ గార్డ్ ((ICG) ప‌ట్టుకొంది. భార‌త సముద్ర స‌రిహ‌ద్దు తీరం నుంచి 11 కిలోమీటర్ల దూరంలోకి ఈ యాసిన్ అనే బోట్ వ‌చ్చింది అయితే దీనిని ఇండియ‌న్ కోస్ట్ గార్డ్ సిబ్బంది చూశారు. ఆ బోట్ వైపు కోస్ట్ గార్డ్ షిప్ వెళ్తుండగానే ఆ బోట్ పారిపోవ‌డానికి ప్ర‌య‌త్నించింది. అయితే ఆలోపే దానిని నిలువరించారు. ఇందులో ఉన్న 10 మంది సిబ్బందిని ఇండియ‌న్ కోస్ట్ గార్డ్ అధికారుల‌కు అదుపులోకి తీసుకున్నారు. 

గత ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన ఇండియ‌న్ కోస్ట్ గార్డ్ ((ICG) ఇదే విధమైన ఆపరేషన్‌లో 12 మంది సిబ్బందితో కూడిన పాకిస్తాన్ బోట్‌ను గుజరాత్ తీరంలో భారత జలాల్లో పట్టుకుంది. అలాగే గ‌తేడాది డిసెంబర్ 20వ తేదీన గుజ‌రాత్ రాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌తో కలిసి ఇండియ‌న్ కోస్ట్ గార్డ్ ((ICG) జాయింట్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించింది. ఇందులో సుమారు రూ. 400 కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్‌, ఆరుగురు సిబ్బందితో కూడిన పాకిస్తాన్ ఫిషింగ్ బోట్‌ను ప‌ట్టుకున్నారు. అయితే ఇలా బోట్ ల ద్వారా పాకిస్తాన్ నుంచి అక్ర‌మంగా మాద‌కద్ర‌వ్యాల‌ను ఇండియాకు తీసుకువ‌స్తున్నారు. ఇటీవ‌ల ఇలాంటి కేసులు పెరిగాయి.