మరి కొద్ది నెలల్లో ప్రారంభంకానున్న శివమొగ్గ ఎయిర్ పోర్టుకు కర్ణాటక మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్ప పేరు పెడతామని ప్రస్తుత సీఎం బసవరాజ్‌ బొమ్మై చెప్పారు. బుధవారం ఆయన విమానశ్రయ పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం ఈ నిర్ణయాన్ని వెలువరించారు. 

క‌ర్ణాట‌క రాష్ట్రంలోని శివ‌మొగ్గ సమీపంలోని సోగానేలో నిర్మిస్తున్న విమానాశ్రయానికి మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప పేరు పెట్టనున్నట్లు సీఎం బసవరాజ్‌ బొమ్మై బుధవారం ప్ర‌క‌టించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ విమానాశ్రయాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభించనున్నట్లు తెలిపారు.

శివ‌మొగ్గ నగర శివార్లలోని సోగానేలో జరుగుతున్న విమానాశ్రయ పనులను సీఎం ప‌రిశీలించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ‘‘ దీనికి బీఎస్ యడియూరప్ప విమానాశ్రయం అని పేరు పెట్టాలని మా మంత్రివర్గం నిర్ణయించినందుకు నేను సంతోషిస్తున్నాను. మేము దానిని (ప్రతిపాదనను భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు పంపుతాము. ఆమోదం త‌రువాత విమానాశ్రయానికి పేరు పెట్టడానికి మేము ఉత్తర్వులు జారీ చేస్తాము. ’’ అని బసవరాజ్‌ బొమ్మై తెలిపారు. 

‘‘ విమానాశ్రయం ప్రస్తుతం UDAN క్రింద ఉంది, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి క్లియరెన్స్ అవసరం. మేము దానిని తీసుకుంటాం. మేము ఇక్కడ ATC, నైట్-ల్యాండింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తాం. డిసెంబర్‌లో ఈ ఎయిర్ పోర్టును ప్రారంభిస్తాం. దీని కోసం అన్ని ఏర్పాట్లును పూర్తి చేస్తాం. పెండింగ్ లో ఉన్న ప‌నుల‌న్నీ పూర్తి చేశాము ప్ర‌జ‌ల సౌక‌ర్యార్థం దీనిని తెరుస్తాము’’ అని ఆయ‌న అన్నారు.

బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత ఇప్పుడు నిర్మాణంలో ఉన్న శివమొగ్గ విమానాశ్రయం కర్ణాటకలో రెండవ అతి పొడవైన రన్‌వేను కలిగి ఉన్న‌ది. మాజీ సీఎం యడ్యూరప్ప శివమొగ్గ ప్రాంతం నుంచే త‌న రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లు పెట్టారు. ఆయన శివ‌మొగ్గ జిల్లాలోని షికారిపుర అసెంబ్లీ సెగ్మెంట్ నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పెద్ద కుమారుడు బి వై రాఘవేంద్ర కూడా శివమొగ్గ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ఎంపీగా ఉన్నారు.

శివమొగ్గ చుట్టుపక్కల ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి విమానాశ్రయం దోహదపడుతుందని సీఎం బొమ్మై అన్నారు. ఈ ప్రాంతంలో వాణిజ్యం,పర్యాటకం మెరుగ‌వుతుంద‌ని చెప్పారు. శివమొగ్గతో పాటు బీజాపూర్ విమానాశ్రయం పనులు పురోగతిలో ఉన్నాయ‌ని అన్నారు. రాయచూర్ విమానాశ్రయం పనులు కూడా ఈ సంవత్సరం ప్రారంభమవుతాయని చెప్పారు. కార్వార్ నౌకాదళ విమానాశ్రయం పనులు కూడా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

2007-08 సంవ‌త్స‌రంలో BS యడియూరప్ప సీఎంగా ఉన్న స‌మ‌యంలోనే శివమొగ్గ విమానాశ్రయాన్ని రూపొందించారని బసవరాజ్‌ బొమ్మై చెప్పారు. అది 2008లో ఆమోదం పొందింద‌ని అన్నారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) మోడల్‌లో అభివృద్ధి చేయడానికి దీనిని ప్రైవేట్ వ్య‌క్తుల‌కు అందించార‌ని, కానీ అది జరగలేదని ఆయ‌న అన్నారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి, మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ, పీడబ్ల్యుడీ డిపార్ట్‌మెంట్‌తో కలిసి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుందని సీఎం చెప్పారు. కాన‌గా శివమొగ్గ విమానాశ్రయం రన్‌వే 3,200 మీటర్ల పొడవు ఉంది.