బెంగళూరు: దక్షిణాది రాష్ట్రాల్లో కమలం వికసించబోతుంది. నరేంద్రమోదీ ప్రధాని మంత్రి అయిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం కర్ణాటక. గతంలో బీజేపీ కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటకీ మోదీ ప్రధాని అయిన తర్వాత మాత్రం ఇదే తొలిసారి. 

ఇకపోతే కర్ణాటకలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ వ్యూహరచన చేస్తోంది. బీజేపీ శాసన సభాపక్ష నేత, మాజీ సీఎం యడ్యూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. 

ఈనెల 25న యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కర్ణాట అసెంబ్లీలో బలనిరూపణ పరీక్షలో విజయకేతనం ఎగురవేసిన తర్వాత బీజేపీ శాసన సభాపక్ష నేత యడ్యూరప్ప బీజేపీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని గవర్నర్ వాజుభాయ్ వాలా ను  కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రికి గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా యడ్యూరప్ప కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

కర్ణాటక అసెంబ్లీలో 105 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విజయం కర్ణాటక ప్రజల విజయం అంటూ అభివర్ణించారు. ఇకపై కర్ణాటకలో సుస్థిర పాలన అందుతోందని చెప్పుకొచ్చారు.   

కన్నడ ప్రజలను అభివృద్ధి పథం వైపు నడిపిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి పట్టిన శని వదిలిందని, 105 మంది సభ్యులతో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని యడ్యూరప్ప మీడియాతో చెప్పారు. జేడీఎస్‌- కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు విసిగిపోయారని చెప్పుకొచ్చారు. 

మరోవైపు సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. యడ్యూరప్పకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఇకపోతే ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఈనెల 25న ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.