పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను మణిపూర్ అంశం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. మణిపుర్‌ అంశంపై పార్లమెంటులో ప్రధాని మోదీ సమగ్ర ప్రకటన చేయాలని విపక్ష కూటమి ‘‘ఇండియా’’ పట్టుబుడుతుంది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను మణిపూర్ అంశం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. మణిపుర్‌ అంశంపై పార్లమెంటులో ప్రధాని మోదీ సమగ్ర ప్రకటన చేయాలని విపక్ష కూటమి ‘‘ఇండియా’’ పట్టుబుడుతుంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ బుధవారం రోజున లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. లోక్‌సభలో కాంగ్రెస్‌ డిప్యూటీ నేత గౌరవ్‌ గొగొయ్‌ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు స్పీకర్‌ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. మరోవైపు లోక్‌సభలో బీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు కూడా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు. ఈ మేరకు లోక్‌స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌కు ఎంపీ నామా నాగేశ్వరరావు లేఖ రాశారు. 


మ‌ణిపూర్ అంశంపై కేంద్ర విధానాలు స‌రిగా లేవ‌ని బీఆర్ఎస్ ఆరోపించింది. రూల్ 198(బీ) ప్ర‌కారం లోక్‌స‌భ‌లో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తున్న‌ట్లు ఎంపీ నామా తెలిపారు. ఇవాళ జ‌రిగే లోక్‌స‌భ బిజినెస్‌లో ఈ నోటీసును కూడా చేర్చాల‌ని నామా లోక్‌సభ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌ను కోరారు. 

మరోవైపు ఢిల్లీ ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లను బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం ఆ బిల్లు ప్రవేశపెడితే వ్యతిరేకంగా ఓటేయాలని కూడా బీఆర్ఎస్ విప్ జారీ చేసింది. బీఆర్ఎస్ ఎంపీలు అందరూ తప్పనిసరిగా పార్లెమంట్‌కు హాజరుకావాలని స్పష్టం చేసింది.