ఢిల్లీలో రూ. 30ల కోసం ఇద్దరు మిత్రుల మధ్య గొడవ జరిగింది. డబ్బులు తిరిగి ఇచ్చేయాలని అడిగిన తర్వాత మొదలైన గొడవలో డబ్బులు ఇచ్చిన వ్యక్తి, అతని సోదరుడు కలిసి తీసుకున్న వ్యక్తిని హతమార్చారు. ఢిల్లీలో ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. 

న్యూఢిల్లీ: కేవలం రూ. 30ల కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు సోదరులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని మోడల్ టౌన్ ఏరియాలో గురువారం చోటుచేసుకుంది. మృతుడిని సోనుగా గుర్తించారు.

సోను వివాహ శుభకార్యాల్లో క్యాటరింగ్ పనికి వెళ్లుతూ ఉండేవాడు. అతనితోపాటే రాహుల్ అనే యువకుడు కూడా పని చేసేవాడు. ఇద్దరూ కలిసే పని చేసేవాళ్లు. ఇటీవలే రాహుల్ నుంచి సోను డబ్బులు తీసుకున్నట్టు తెలిసింది. ఆ తర్వాత డబ్బుల గురించి వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది.

ఘటన జరిగిన రోజు రాహుల్, తన సోదరుడు హరిశ్‌తోపాటు సోను కలిశారు. డబ్బులు తిరిగి ఇచ్చేయాల్సిందిగా సోనును ఆదేశించారు. ఇది ఆ ముగ్గురి మధ్య గొడవకు దారి తీసింది. అనంతరం, సోను ఆ ఇద్దరు అన్నదమ్ములు కొట్టారు. కడుపులో కత్తితోపలుమార్లు పొడిచేశారు. అనంతరం, సోను రోడ్డు పైనే కుప్పకూలిపోయాడు. 

Also Read: ఏడు అడుగుల పురుషాంగం డ్రెస్ ధరించి మహిళలను వేధిస్తున్న నిందితుడు.. అరెస్టు చేసిన బ్రెజిల్ పోలీసులు

ఈ ఘటన గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సోనును సమీప హాస్పిటల్‌కు తరలించారు. కానీ, అతను అప్పటికే మరణించాడని వైద్యులు తేల్చారు. ఈ కాలంలో పోలీసులు నిందితులు రాహుల్, హరీశ్ సోదరులను పట్టుకుని అరెస్టు చేశారు.