ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆంచల్ అనే యువతి పొరుగునే ఉంటున్న జాకీ అనే యువకుడిని ఆమె కుటుంబ ఇష్టాయిష్టాలకు విరుద్ధంగా ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ, పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమె కుటుంబీకులు అసంతృప్తిగానే ఉన్నారు. చివరికి సోదరి ఇంటికి వెళ్లి ఆమె భర్తను అతికిరాతకంగా హతమార్చారు. 

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. కుటుంబానికి ఇష్టం లేకుండా లవ్ మ్యారేజీ చేసుకున్నదని కక్ష పెంచుకున్నారు. అమ్మాయి తండ్రి సహా ఆమె సోదరులూ ఆ పెళ్లిని జీర్ణించుకోలేకపోయారు. అబ్బాయిదీ అదే కులం అయినప్పటికీ లవ్ మ్యారేజీని వారు సహించలేకపోయారు. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటున్న వారి ఇంటికి ఆ సోదరులు కత్తి, తుపాకీ పట్టుకుని వెళ్లారు. తన సోదరి భర్తపై తొలుత గన్ ఫైరింగ్ జరిపారు. ఆ తర్వాత కత్తితో తల నరికేశారు. అడ్డు వచ్చిన సోదరిపైనా కత్తితో దాడి చేశారు. ఈ ఘటన
మీరట్ జిల్లా సర్దానాలో చోటుచేసుకుంది. 

గాలి ఖటికాన్‌కు చెందిన ఆంచల్ అనే యువతి పక్కనే ఉన్న 25 ఏళ్ల జాకీ కొంతకాలం రిలేషన్‌లో ఉన్నారు. వారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ, ఆ యువతి ఇంటిలో అభ్యంతరం తెలిపారు. దీంతో వారు కోర్టులో కొన్ని నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని వారు సంతోషంగా ఉంటున్నప్పటికీ ఆ యువతి కుటుంబీకులు మాత్రం అసంతృప్తితోనే రగిలిపోయారు. వారిద్దరూ ఒక్కటై జీవించడంపై వారు సంతోషంగా లేరని బహిరంగంగా పలుమార్లు పేర్కొన్నారు. అంతేకాదు, ఆ దంపతులను తరుచూ బెదిరించారు. 

సోమవారం ఉదయం ఆ అమ్మాయి కుటుంబీకులు జాకీ నివాసంలోకి చొచ్చుకెళ్లారు. తొలుత జాకీపై ఓ తుపాకీతో కాల్చారు. జాకీ నేలపై పడగానే.. కత్తి తీసి ఆయనపై దాడి చేశారు. తల నరికేశారు. తన భర్తను కాపాడుకోవడానికి ఆ అమ్మాయి ఎంతో ప్రయత్నించింది. ఈ ప్రయత్నాన్ని అడ్డుకునే క్రమంలో ఆమెపైనా వారు కత్తితో దాడి చేశారు.

ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. స్థానికుల్లో కొందరు వెంటనే పోలీసులకు తెలిపారు. పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. గాయపడ్డ ఆంచల్‌ను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. ఆమె హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నది. ఆంచల్ సోదరుడు అన్షును అదుపులోకి తీసుకున్నారు. హత్య చేయడానికి ఉపయోగించిన మారణాయుధాలను అదుపులోకి తీసుకున్నారు. మరో సోదరుడు పరారీలో ఉన్నట్టు తెలిసింది. జాకీ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం చేయడానికి తరలించారు.

ఇటీవలే తమిళనాడుకు చెందిన ఓ మంత్రి కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమ పెళ్లి చేసుకుంది. అనంతరం తనకు రక్షణ కల్పించాలని బెంగళూరు సిటీ పోలీసులను ఆశ్రయించింది. వివరాలు.. పీకే శేఖర్ బాబు తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. పీకే శేఖర్ బాబు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు అత్యంత సన్నిహితుడుగా పేరుపొందాడు. అతని కూతురు జయ కల్యాణి ఒక డాక్టర్. అయితే జయ కల్యాణి కుటుంబ ఇష్టానికి వ్యతిరేకంగా.. వ్యాపారవేత్త సతీష్ కుమార్‌ను వివాహం చేసుకుంది. 

కర్ణాటకలోని విజయనగర్ జిల్లాలోని హిరేహడగలిలో హాలస్వామి మఠంలో జయ కల్యాణి, సతీష్‌ల వివాహం జరిగింది. వివాహం జరిగిన వెంటనే జయ కల్యాణి మీడియాకు ఓ వీడియో విడుదల చేసింది. సతీష్, తాను దాదాపు ఆరేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టుగా జయ కల్యాణి వీడియోలో పేర్కొన్నారు. తాము పెళ్లి చేసుకోవడానికి ఇళ్లలో నుంచి బయటికొచ్చామని చెప్పారు. తామిద్దరం మేజర్స్ అని.. అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నామని తెలిపారు. సతీష్ కుటుంబాన్ని బెదిరించవద్దని జయ కల్యాణి తన తండ్రికి విజ్ఞప్తి చేశారు. తనకు, తన భర్త సతీష్‌కు ముప్పు ఉందనే భయంతో బెంగళూరు పోలీసులను ఆశ్రయించినట్టుగా తెలపారు.