బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పై బ్రిటీష్ అంబాసిడర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన హిందువే కానీ, ఆయన హార్ట్ అండ్ మైండ్ బ్రిటీషే అని వివరించారు. ఇదే సందర్భంగా యూకే, భారత్‌ల మధ్య సంబంధాలపై మాట్లాడారు. 

న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు తీసుకున్న తర్వాత మన దేశంలో ఆయన గురించి విస్తృత చర్చ జరిగింది. పంజాబీ మూలాలు గల రిషి సునాక్ హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన గురించి, భారత్, బ్రిటన్ సంబంధాల పై బ్రిటీష్ హైకమిషనర్ ఇండియా టుడే కాంక్లేవ్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ పీఎం రిషి సునాక్ హిందువే.. కానీ, ఆయన హృదయం, ఆలోచనలు (మైండ్) బ్రిటీష్‌వే అని వివరించారు.

‘ఆధునిక యూకే వైవిధ్య దేశం. రిషి సునాక్ సమర్థుడు కాబట్టే ఆయన ప్రధానమంత్రి కాగలిగారు. ట్యాలెంట్ ఉంటే ఉన్నత స్థానాలకు చేరవచ్చనేదానికి ఆయన ఉదాహరణ’ అని ఇండియాకు బ్రిటీష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ అన్నారు. యూకే, భారత్ మధ్య సంబంధాలు ఎప్పటిలాగే కొనసాగుతాయని తెలిపారు.

భౌగోలిక రాజకీయాలు ప్రపంచంలో తీవ్రమవుతున్నాయని, ఇలాంటి సందర్భంలో ఈ రెండు దేశాల మద్య వలసలు, వాణిజ్యంపై పాలసీలను కలిగి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బోరిస్ జాన్సన్‌తో, ఆ తర్వాత లిజ్ ట్రస్‌తో.. ఇప్పుడు రిషి సునాక్‌తో సత్సంబంధాలు ఉన్నాయని వివరించారు. భారత్, యూకేలు కలిసే ముందడుగు వేస్తాయని తెలిపారు. భారత్ అభివృద్ధి చెందకుండే కేవలం యూకే మాత్రమే పురోగతి సాధించడానికి అవకాశాలే లేవని అన్నారు. ఈ రెండు దేశాల మధ్య ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయని, భవిష్యత్‌లో ఈ దేశాలు మరింత సన్నిహితం అవుతాయని వివరించారు.

Also Read: యూకే నూతన పీఎంగా రిషి సునాక్.. ప్రపంచవ్యాప్తంగా కీలక భారత సంతతి నేతలు వీరే

కాగా, విజయ్ మాల్యా, నీరవ్ మోడీలను భారత్‌కు అప్పగించే విషయాల పైనా ఆయన స్పందించారు. ‘ఇది ప్రభుత్వ విషయం కాదు. ఇది కోర్టుకు సంబంధించిన వ్యవహారం. ఎగవేతదారులకు, దాక్కోవడానికి యూకేను సేఫ్ ప్లేస్‌గా చూడాలనే ఉద్దేశం తమకు లేదు. న్యాయం చక్రాలకు బంధనాలు విధించాలని అనుకోవడం లేదు. న్యాయం తప్పకుండా జరిగి తీరుతుంది’ అని వివరించారు.

భారత మూలాలు గల రిషి సునాక్ యూకే ప్రధానిగా గెలిచి చరిత్ర లిఖించారు. భారత సంతతి బ్రిటన్ ప్రధాని కావడం ఇదే తొట్టతొలిసారి. ఈ ఎన్నికలో గెలవడానికి 100 మంది ఎంపీల మద్దతు అవసరం. పోటీ నుంచి బోరిస్ జాన్సన్, పెన్నీ మోర్డాంట్ తప్పుకున్నారు. దీంతో రిషి సునాక్‌ తదుపరి ప్రధానిగా ఖరారైంది. ఆయన భారత సంతతి హిందువు. ఆయనకు మన దేశంతో ఉన్న కనెక్షన్ చూద్దాం.

రిషి సునాక్ యార్క్‌షైర్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆయన పార్లమెంటులో భగవద్గీతపై ప్రమాణం చేసి తన ప్రమాణస్వీకారం చేశారు. ఇలా చేసిన తొలి యూకే పార్లమెంట్ సభ్యుడు. రిషి సునాక్ తల్లి తండ్రి పూర్వీకులు భారతీయులే. సునాక్ తల్లదండ్రులు ఫార్మాసిస్టులు. ఈస్ట్ ఆఫ్రికా నుంచి 1960లో యూకేకు వలస వెళ్లిపోయారు. సునాక్ తండ్రి యశ్వీర్ సునాక్ నేషనల్ హెల్త్ సర్వీస్ జనరల్ ప్రాక్టీషనర్. తల్లి ఉషా సునాక్ ఓ కెమిస్ట్ షాప్ నిర్వహించేవారు.

రిషి సునాక్ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ్ మూర్తి కూతురు అక్షత మూర్తీని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పేర్లు క్రిష్ణ, అనౌష్క. బోరిస్ జాన్సన్ హయాంలో ఆర్థిక మంత్రిగా పని చేసినప్పుడు డౌనింగ్ స్ట్రీట్‌లో రిషి సునాక్ తన నివాసంలో దీపావళికి దీపాలు వెలిగంచేవారు.