ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అరుదైన ఘటన జరిగింది. మూడో విడతలో భాగంగా ఈ రోజు యూపీలో 59 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతున్నది. రెండు వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు నూతన వధువులు పెళ్లి చేసుకున్న తర్వాత అత్తింటి వారి కంటే ముందు పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

లక్నో: పోలింగ్ దగ్గరికి రాగానే ఇప్పటికీ ఓట్లు వేయాలని ప్రచారం చేయాల్సి వస్తున్నది. ఓటు వేయడం పౌరుల బాధ్యత అని, తప్పకుండా ఆ హక్కు వినియోగించుకోవాలని సెలెబ్రిటీలు, ప్రముఖులు పిలుపు ఇస్తుంటారు. గ్రామాల్లో అవగాహన తక్కువగా ఉంటుందని ఈ ప్రచారం చేస్తుంటారు. కానీ, ఈ మధ్య పట్టణాల్లోనే ఓటింగ్ పర్సెంట్ తక్కువగా నమోదు అవుతున్నది. గ్రామాల్లోనూ ఓటింగ్‌పై మంచి అవగాహన ఉన్నది. ఈ విషయం మరోమారు ఉత్తరప్రదేశ్‌లో వెల్లడైంది. ఇద్దరు యువతులు పెళ్లి చేసుకుని పెళ్లి బట్టలతోనే పోలింగ్ బూత్‌కు వెళ్లారు. మెట్టినింట అడుగు పెట్టకముందే ఎన్నికలకు వేళాయేరా అన్నట్టు పోలింగ్ బూత్ వైపు అడుగులు వేశారు. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో ఆ ఇద్దరు వధువులు(Bride) ఎంతో మంది ఓటర్లకు ఆదర్శంగా నిలిచారు.

ఉత్తరప్రదేశ్‌లో ఈ రోజు మూడో విడత ఎన్నికలు(Third Phase Elections) జరుగుతున్నాయి. 59 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతున్నది. ఇందులో ఫిరోజాబాద్ కూడా ఉన్నది. ఫిరోజాబాద్‌లో ఓ యువతికి నిన్న రాత్రి వివాహం జరిగింది. పొద్దున ఆమె అత్తింటి వారికి వెళ్లాల్సి ఉన్నది. కానీ, ఇదే రోజు వారి నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతున్నది. దీంతో ఆహె తన ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నది. అంతే.. పొద్దున్నే లేచి భర్తతో వారింటికి వెళ్లకుండా పోలింగ్ బూత్ వైపు నడిచింది. పెళ్లి దుస్తుల్లోనే ఆమె తన భర్తను తీసుకుని పోలింగ్ బూత్‌కు వెళ్లింది. అక్కడ ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నది. ఆమె బయటకు రాగానే అక్కడ కెమెరాలు గుమిగూడాయి. పెళ్లి డ్రెస్‌లో పోలింగ్ కేంద్రానికి రావడం కొత్తగా.. వింతగా.. ఇంకోవిధంగా ఆదర్శంగా కనిపించింది. ఆమె పోలింగ్ కేంద్రం నుంచి బయటకు రాగానే కెమెరాలు వారిపై ఫోకస్ పెట్టాయి. క్లిక్ మనిపిస్తుండగా.. ఆమె ఓటు వేసినదానికి గుర్తుగా తన చేతి వేలికి పెట్టిన ఇంక్‌ను చూపెట్టింది.

కాగా, మహోబాలోనూ మరో నూతన వధువు ఇదే విధంగా పెళ్లి మంటపం నుంచి పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. మహోబాకు చెందిన నూతన వధువు గీత తొలిసారిగా తన ఓటు హక్కు వినియోగించుకున్నది. పెళ్లి డ్రెస్‌లోనే ఓటు వేసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, తనకు ఎంతో సంతోషం వేసిందని వివరించారు. తాను తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలిపారు. అయితే.. తన అప్పగింతలకు ముందు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసినట్టు వివరించారు. అంతేనా.. అక్కడ ఉన్న ప్రజలనూ ఓటేయాల్సిందిగా పిలుపు ఇచ్చింది. తాను ఈ ప్రాంత అభివృద్ధికి ఓటేసినట్టు తెలిపారు.

ఉత్తప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్నాయి. ఇది వరకే రెండు విడతల పోలింగ్ ముగిసింది. మూడో విడతలో భాగంగా 59 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతున్నది. ఇందులో 16 జిల్లాల్లో ఓటింగ్ జరుగుతున్నది. ఈ సీట్లల్లో 2.15 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు. కాగా, 59 అసెంబ్లీ నియోజకవర్గాల బరిలో మొత్తం 627 అభ్యర్థులు దిగారు. 

హథ్రాస్, ఫిరోజాబాద్, ఇటా, కాస్‌గంజ్, మెయిన్‌పురి, ఫర్రుకాబాద్, కన్నౌజ్, ఎటావా, ఔరాయా, కాన్పూర్, దేహత్, కాన్పూర్ నగర్, జలౌన్, ఝాన్సీ, లలిత్‌పుర్, హామిర్‌పుర్, మహోబాలలో పోలింగ్ జరుగుతున్నది.