నాగిని డ్యాన్స్ ఆ వరుడి కొంప ముంచింది. సాధారణంగా ఉత్తరాదిన పెళ్లిళ్లలో నాగిని డ్యాన్స్ చేయడం చాలా కామన్. కానీ ఆ డ్యాన్స్ కారణంగానే ఓ యువకుడి పెళ్లి ఆగిపోయింది. వరుడు పీకల దాకా మద్యం తాగి  నాగిని నృత్యం చేయడంతో అతనికి వధువు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరీ లోని మైలాని ప్రాంతానికి చెందిన యువతి ఐటీఐ డిప్లమా చదువుతోంది. ఆమెకు డిగ్రీ డ్రాప్ ఔట్ చేసిన యువకుడితో పెళ్లి కుదిరింది. ఆదివారం వారి పెళ్లి జరగాల్సి ఉండగా... పెళ్లి కూతురు ఉన్నపళంగా పెళ్లిని రద్దు చేసింది.

పెళ్లికి ముందు వధూవరులు బహుమతులను ఇచ్చిపుచ్చుకున్నారు. ఆపై పెళ్లి వేడుక ప్రారంభానికి ముందు వధువు కుటుంబానికి ఆహ్వానం పలికే కార్యక్రమంలో భాగంగా వరుడు  పీకల దాకా మద్యం తాగి డీజే సౌండు మధ్య వివాహ వేడుకల్లో  నాగిని నృత్యం చేశాడు. వరుడు పాములాగా బుసలు కొడుతూ కింద పొర్లుతూ నృత్యం చేస్తుండగా అతని స్నేహితులు ఆయనపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు. 

వరుడు.. వధువు పక్కన కాకుండా స్టేజీపై అలా డ్యాన్స్ చేయడం కాస్త ఎబ్టెట్టుగా ఉండటంతో.. వధువు బంధువు ఒకరు అతనిని ఆపడానికి వెళ్లారు. ఆ క్రమంలో అతను వధువు బంధువు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదంతా చూస్తూ ఉండిపోయిన పెళ్లి కూతురు వెంటనే తనకు ఈ పెళ్లి వద్దని తేల్చి చెప్పింది.

వెంటనే షాకైన పెళ్లి కొడుకు.. పెళ్లి రద్దు చేస్తానన్నందుకు ఆమెపై చేయి కూడా చేసుకున్నాడు. అయినప్పటికీ యువతి వెనక్కి తగ్గలేదు. వాళ్లు పెళ్లికి ఇచ్చిన బహుమతులు అన్నీ తిరిగి ఇచ్చేసింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది.

యువతికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె వినిపించుకోకపోవడం గమనార్హం. దీంతో.. పెళ్లి ఖర్చులు కూడా తిరిగి ఇవ్వడానికి వరుడు కుటుంబసభ్యులు అంగీకరించారు.