మధ్యప్రదేశ్ లో వినూత్న ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లిలో ఓ వధవు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నా జిల్లాలో వధువు గుర్రంపై ఊరేగుతూ వరుడి ఇంటికి వచ్చింది. 

భారతీయ సంప్రదాయం ప్రకారం వరుడు గుర్రంపై ఊరేగుతూ వధువు ఇంటికి రావడం ఆనవాయితీ. అయితే దీన్ని బద్దలు కొట్టడానికే, కొడుకులకంటే కూతుళ్ల ఎవ్వరికీ తీసిపోరని చెప్పడానికే ఆమె ఇలా చేసింది. 

వివరాల్లోకి వెడితే.. సత్నా జిల్లాకు చెందిన దీపా వలేచా అనే వధువు ఈ సాహసం చేసి అందర్నీ మెప్పించింది. వాలెచా కుటుంబానికి దీపా ఏకైక కుమార్తె. తన పెళ్లి సందర్భంగా వరుడి ఇంటికి గుర్రంపై స్వారీ చేస్తూ వెళ్లాలనే తన చిరకాల కోరికను నెరవేర్చుకుంది.

కుమార్తెలకు సమాజంలో కొడుకులాగే సమాన హక్కులున్నాయని చెబుతూ వధువు గుర్రపు స్వారీ చేస్తూ పెట్టిన చిత్రాలు, వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. గుర్రపు స్వారీ చేసిన వధువు దీపను నెటిజన్లు విపరీంగా అభినందిస్తున్నారు.