మధ్యప్రదేశ్‌లో ఇద్దరు అక్కా చెల్లెళ్ల పెళ్లిళ్లు ఒక్కేసారి జరిగింది. ఒకే వేదికపై జరిగింది. కానీ, పెళ్లి జరుగుతుండగా కరెంట్ పోవడంతో వరుళ్లు తారుమారు అయ్యారు. అక్కను చేసుకోవాల్సిన వరుడు చెల్లిని, చెల్లిని చేసుకోవాల్సిన వరుడు అక్కను పెళ్లి చేసుకున్నాడు. ఒకే తరహా ముస్తాబు కావడంతో వధువులను గుర్తించలేకపోయారు. అప్పగింతల కార్యక్రమంలో ముఖంపై తెరను తొలగించడంతో జరిగిన తప్పిదం వెలుగులోకి వచ్చింది.
భోపాల్: వారిద్దరూ అక్కా చెల్లెళ్లు. ఒకే సారి.. ఒకే వేదిక మీద ఇద్దరి పెళ్లిళ్లకు ప్లాన్ రెడీ అయింది. ఇద్దరికీ పళ్లి సంబంధాలు చూశారు. వేర్వేరు కుటుంబాలకు చెందిన ఇద్దరు అబ్బాయిలతో ఈ అక్కా చెల్లెళ్ల పెళ్లి జరిపించడానికి సర్వం సిద్ధం అయింది. అక్కా చెల్లెళ్లు ఇద్దరినీ ఒకే తరహా ముస్తాబు చేశారు. ఒకే తరహా డ్రెస్‌లు వేసుకున్నారు. మేకప్ కూడా దాదాపు ఒకే రకంగా వేశారు. పైగా ముఖాన్ని కవర్ చేస్తూ తెరలు కప్పుకున్నారు. మద్దెల వాయిద్యాలు మోగుతున్నాయి. పురోహితుడు మంత్రాలు ఉచ్చరిస్తున్నారు. ఇంతలో కరెంట్ పోయింది. కానీ, ముహూర్త బలానికి పెద్ద పీట వేసిన వారు.. పెళ్లి సకాలంలో జరిగిపోవాలనుకున్నారు. పవర్ కట్ అయినంత మాత్రాన పెళ్లి తంతును ఆపాలని అనుకోలేదు. ఆ చీకట్లోనే దాదాపు పెళ్లి తంతు ముగిసిపోయింది. కానీ, ఆ చీకట్లోనే జరగాల్సిన నష్టం కూడా జరిగిపోయింది. వరుళ్లు తారుమారు అయ్యారు. అక్కను చేసుకోవాల్సిన వరుడు చెల్లిని, చెల్లిని చేసుకోవాల్సిన వరుడు అక్కను మనువాడాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌లో చోటుచేసుకుంది.
ఉజ్జయిన్‌కు చెందిన రమేశ్ లాల్‌కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారి పేర్లు నికిత, కరిష్మా. వారిద్దరికీ ఒకే సారి పెళ్లి జరిపించాలని నిర్ణయించాడు. అనుకున్నట్టుగానే ఆయన ఇద్దరు కూతుళ్లకు దంగ్వారా భోలా, గణేశ్ అనే వేర్వేరు కుటుంబాలకు చెందిన యువకులతో పెళ్లి జరిపించాలని సిద్ధం అయ్యాడు. ఒకే వేదికపై పెళ్లి పీటలపై పెళ్లి కూతుళ్లు, పెళ్లి కుమారులు కూర్చున్నారు. పెళ్లి కూతుళ్లు ఇద్దరినీ ఒకే రకంగా ముస్తాబు చేశారు. పైగా ముఖం కనిపించకుండా తెరలు ధరించి ఉన్నారు. ఇంతలో కరెంట్ పోయింది. అయినా.. పెళ్లి తంతు అలాగే కొనసాగించారు. ఈ గందరగోళంలోనే వరుళ్లు తారుమారు అయ్యారు. పురోహితుడు కూడా ఇలా తారుమారు అయిన జంటలనే అగ్ని గుండం చుట్టూ తిప్పించాడు.
అంతా ముగిసిన తర్వాత పెళ్లి కూతుళ్లను అప్పజెప్పే కార్యక్రమంలో అసలు విషయం బయటపడింది. వరుళ్లు తమ తమ భార్యలను వెంట తీసుకోవడానికి దగ్గరకు తీసుకున్నారు. వారి ముఖంపై ఉన్న తెరలు తీసేశారు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. దీంతో అంతా గందరగోళం నెలకొంది. వాగ్వాదం మొదలైంది. మూడు వైపుల నుంచి గొడవలు జరిగాయి. చిన్న వివాదం తర్వాత వారంతా ఒక పరిష్కారానికి వచ్చారు. ఆ పెళ్లి కూతుళ్లు, పెళ్లి కుమారుల కోసం పెళ్లి తంతును మరోసారి తర్వాతి రోజు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు.
