మరి కొద్ది గంటల్లో వారి వివాహం. ఇరు కుటుంబసభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే... రిసెప్షన్ కి రెడీ అవుతానని చెప్పి వధువు బ్యూటీ పార్లర్ కి వెళ్లి... కనిపించకుండా పోయింది. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా.. వధువు కనిపించడం లేదు అనే విషయం తెలియగానే.. వరుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాహం తాలూకు ఫ్లెక్సీలు చించివేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే... చెన్నై శివారు నగరం పూందమల్లి సమీపాన చెంబరంపాక్కంకు చెందిన యువకుడికి మధురాంతకం ప్రాంతానికి చెందిన యువతితో పెద్దలు వివాహం కుదిర్చారు. గురువారం ఉదయం నసరత్‌పేటలోని ఓ కల్యాణమండపంలో వివాహానికి ఏర్పాట్లు ఘనంగా చేశారు.

బుధవారం సాయంత్రం ఆ కల్యాణ మండపంలో అట్టహాసంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్‌కు  వరుడు వచ్చాడు. కానీ ఎంతసేపైనా వధువు, ఆమె బంధువులెవరూ రాకపోవడంతో వరుడు కంగారు పడ్డాడు. రిసెప్షన్‌కు రావడానికి గాను అలంకరణ నిమిత్తం బ్యూటీపార్లర్‌కు వెళ్లిన వధువు ఉద్దేశపూర్వకంగా అదృశ్యమైందని, ఆమె కోసం ఆమె బంధువులు గాలిస్తున్నారని తెలుసుకున్న వరుడు, అతని బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు.

 కల్యాణ మండపంలోని వివాహం తాలూకు ఫ్లెక్సీలు, బ్యానర్లను చించివేశారు. నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ నసరత్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో వరుడు కుటుంబీకులు ఫిర్యాదు చేశారు.