మనస్పర్థలతో, అక్రమసంబంధాలతో వివాహాలు విచ్చిన్నమవుతున్న నేటి కాలంలో మనసును కదిలించే ఓ అపురూప ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. భార్యభర్తల అనుబంధానికి అద్దం పడుతుంది ఈ ఘటన.  కాబోయే భార్య ప్రాణాపాయంలో పడి, ఆస్పత్రి బెడ్‌ మీద ఉంటే అక్కడే వివాహ తంతు పూర్తిచేసి జీవితాంతం తనకు అండగా ఉంటానని బాస చేశాడు. 

ఉత్తరప్రదేశ్‌, ప్రయాగ్‌రాజ్‌ జిల్లాకు చెందిన అద్వేష్‌, ఆర్తిలకు పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఇందుకోసం ముహూర్తం కూడా నిర్ణయించారు. అయితే పెళ్లి రోజూ ఆర్తి ప్రమాదవశాత్తూ ఇంటికప్పు నుంచి జారి కిందపడిపోయింది. 

ఈ ప్రమాదంలో ఆర్తి కాళ్లు, వెన్నెముకకు గాయాలయ్యాయి. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. మామూలుగా ఇలాంటి సమయాల్లో పెళ్లి కొడుకు తరఫువాళ్లు పెళ్లి క్యాన్సిల్ చేస్తుంటారు. కానీ ఇక్కడ ఈ పెళ్లికొడుకు అద్వేష్‌ అలా చేయలేదు.

తన బంధువులతో కలిసి హుటాహటిన ఆస్పత్రికి చేరుకున్నాడు. ముహూర్త సమయం దాటిపోకముందే ఆర్తి నుదుటిన సింధూరం దిద్ది తన భార్యగా చేసుకున్నాడు. ఇరు కుటుంబాలు వారికి ఆశీస్సులు అందజేశాయి. 

ఈ అరుదైన సంఘటన గురించి ఆ ఆస్పత్రి డాక్టర్‌ సచిన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘ఆర్తి వెన్నెముకకు గాయమైంది. కాళ్లు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం తాను నడిచే పరిస్థితుల్లో లేదు. కానీ ఈరోజే తన పెళ్లి జరగాల్సి ఉంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పెళ్లి తంతు నిర్వహించేందుకు అనుమతినిచ్చాం. కాళ్లు మాత్రం కదపొద్దని తెలిపాం. ఆ జంటను చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది’’ అని పేర్కొన్నారు.

ఈ సంఘటన మీద ఆర్తి మాట్లాడుతూ.. ‘మొదట నాకు కాస్త భయం వేసింది. అయితే నా భర్త నాకు ధైర్యం చెప్పాడు. నా ఆరోగ్యం కుదుటపడకపోయినా తోడుగా ఉంటానన్నాడు. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది’’ అని ఉద్వేగానికి లోనైంది. ఇక అద్వేష్‌ మాట్లాడుతూ.. ‘‘ ఏం జరిగినా వెనకడుగు వేయొద్దు అనుకున్నాను. తను కష్టాల్లో ఉన్నపుడే కదా నా అవసరం ఉండేది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’’అని భార్యపై ప్రేమను చాటుకున్నాడు.