కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో ఆనందంగా పెళ్లి తంతు జరిపించారు. ఆ పెళ్లి తంతు గడిచి కనీసం 24గంటలు కూడా గడవక ముందే వారి ఆనందమంతా ఆవిరయ్యింది. నవ వధువు కనిపించకుండా పోయింది. ఏమైదా అని ఆరా తీస్తే.. ఆమె తన ప్రియుడితో లేచిపోయిందని తెలిసి అందరూ షాకయ్యారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సేలం జిల్లా సెంగవల్లి నడువలూరుకు చెందిన పెరియస్వామి కుమారుడు రవికుమార్‌(28) వరి కోత యంత్రం డ్రైవర్‌. ఆయనకు చిన్నమసముద్రానికి చెందిన పూమారై కుమార్తె సత్య(20)తో ఈనెల 4వ తేదీ వివాహం జరిగింది. 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు దుకాణానికి వెళ్తానని చెప్పిన సత్య తిరిగిరాలేదు. 

దీంతో భర్త రవికుమార్‌ సెంగవల్లి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో నవ వధువు చిన్నసముద్రానికి చెందిన వల్లరసు(23)ను వివాహం చేసుకొని, తమకు రక్షణ కల్పించాలంటూ ఆత్తూర్‌ పోలీసులను ఆశ్రయించింది. 

సమాచారం అందుకున్న రవికుమార్‌, బంధువులు, సత్య తల్లిదండ్రులు స్టేషన్‌కు చేరుకున్నారు. తాను వల్లరసును రెండేళ్లుగా ప్రేమిస్తున్నానని, తమ పెళ్లి అంగీకరించని తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేశారని, దీంతో తాను, వల్లరసు మదురైలో వివాహం చేసుకున్నట్టు తెలిపింది. 

ఇక రవికుమార్‌ కట్టిన తాళి, వివాహం సందర్భంగా వారు పెట్టిన నగలను అప్పగించింది. అనంతరం వివాహానికి అయిన ఖర్చును ఇవ్వాలని రవికుమార్‌ కోరడంతో, వాటిని ఇచ్చేందుకు సమ్మతించిన సత్య, వల్లరసులు ఈ మేరకు స్టాంప్‌ పేపర్లపై సంతకాలు చేసి వెళ్లిపోయారు.