ఆనందంగా పెళ్లి చేసుకుంటున్న ఓ జంటకు మందుబాబులు చేసిన రచ్చ నచ్చలేదు. ప్రశాంతంగా.. ఆనందంగా తాము చేసుకుంటున్న పెళ్లిని విపరీతంగా మద్యం సేవించి రచ్చరచ్చ చేశారు. దీంతో.. వధువుకి వాళ్లు చేస్తున్నదంతా నచ్చలేదు. అంతే.. వెంటనే.. అసలు నాకు ఈ పెళ్లే వద్దంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.  ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. షాజహాన్‌పూర్ పరిధిలోని మవియాపూర్ నుంచి మగపెళ్లివారు బిస్లండా వచ్చారు. అయితే వారు వందమందికి పైగా ఉన్నారు. కరోనా కట్టడి నిబంధనలు ఉల్లంఘించారు. దీంతో మగపెళ్లివారు, ఆడపెళ్లివారి మధ్య వివాదం మొదలైంది.

ఇంతలో మద్యం మత్తులో ఉన్న కొంతమంది పెళ్లివారు నానా హంగామా చేసి, పెళ్లికుమార్తె సోదరుడు, చిన్నాన్నలను కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న పెళ్లికుమార్తె ఈ పెళ్లికి నిరాకరించింది. దీంతో వివాదం మరింత ముదరడంతో పోలీసుల వరకూ చేరింది. వారు పెళ్లి వేదక వద్దకు చేరుకున్నారు. ఇరుపక్షాలవారినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి వారి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. అయితే పెళ్లికుమార్తె ఈ పెళ్ళి వద్దంటూ మొండికేసింది. దీంతో వరుడు పెళ్లి కాకుండానే తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది.