కర్ణాటకలో ప్రేత వివాహం నిర్వహించే సంప్రదాయం ఉన్నది. కాన్పు సమయంలో మరణించే పిల్లలకు పెళ్లి చేసే ఆనవాయితీ కన్నడ, కేరళలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ అమలు అవుతున్నది. ఇందులో భాగంగానే జులై 28న 30 ఏళ్ల క్రితం మరణించిన వారికి పెద్దలు ఎంతో బాధ్యతగా పెళ్లి చేశారు.
బెంగళూరు: కర్ణాటకలో అనాదిగా ఓ సంప్రదాయం వస్తున్నది. కాన్పు సమయంలో మరణించిన పిల్లలకు.. వారి జీవించే ఉంటే యుక్త వయస్సు వచ్చే సంవత్సరాలను అంచనా వేసుకుని పెళ్లి చేస్తుంటారు. నిజంగా చేసే పెళ్లి వేడుకకు ఏ మాత్రం తీసిపోకుండా మరణించిన వారి పెళ్లి చేస్తుంటారు. కాన్పు సమయంలో ఓ మగ శిశువు మరణిస్తే.. ఆ మగ శిశువు మరణించి 20 ఏళ్లు దాటిన తర్వాత.. కాన్పు సమయంలో మరణించిన ఆడ శిశువుతో పెళ్లి చేస్తారు. ఇక్కడ పెళ్లి సంబంధం చూడటం, ఎంగేజ్‌మెంట్ మొదలు.. పెళ్లి చేసి అప్పగింతలు, బారాత్ వరకూ ప్రతీ తంతు నిర్వహిస్తారు. ఇటీవలే జరిగిన ఓ పెళ్లి వేడుకను యూట్యూబర్ ఆనీ అరుణ్ వీడియోల రూపంలో ట్విట్టర్ త్రెడ్‌లో పోస్టు చేశారు. ఈ త్రెడ్ తెగ వైరల్ అయింది.
దక్షిణ కన్నడ జిల్లాలో గురువారం ఓ పెళ్లి జరిగింది. ఆ పెళ్లిలో మీకు వరుడు, వధువు కనిపించదు. ఎందుకంటే వారు 30 ఏళ్ల క్రితమే మరణించారు. ఆ పెళ్లిలో వారు కూర్చోవాల్సిన ప్లేస్‌లో ఖాళీ కుర్చీలు.. వారికి బహూకరించిన వస్త్రాలు ఇతరాలు ఉంటాయి. ఈ వివాహ విధానాన్ని ప్రేత కళ్యాణం లేదా.. మరణించినవారి పెళ్లిగా పిలుస్తుంటారు.
శోభ, చందప్పలకు గురువారం (జులై 28న) దక్షిణ కన్నడలో పెద్దలు పెళ్లి జరిపించారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కుటుంబాలు నిష్టగా పెళ్లి చేశాయి. ఈ కార్యక్రమానికి పిల్లలకు, పెళ్లికాని వారికి ఆహ్వానం ఉండదు. ఈ కార్యక్రమం అంతా కూడా ఎక్కడా బాధ కనిపించదు. ఎవరి ముఖంలోనూ ఆ వెలితి కనిపించదు. నిజంగానే పెళ్లి చేసి వారి బాధ్యత తీరుస్తున్నట్టుగా ఉన్నది. పిల్లలు చనిపోయారన్న ఆలోచన కాదు కదా.. వారి పెళ్లి జరిపిస్తున్న తంతులో జోకులు పేల్చుకుంటూ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ పెళ్లి వేడుకను హుషారుగా నిర్వహిస్తారు.
చనిపోయిన వారి పెళ్లే కదా.. చాలా సింపుల్ అని భావిస్తే మాత్రం పొరపాటే. ఎందుకంటే.. మరణించినప్పటికీ వారికి పర్ఫెక్ట్ భాగస్వామినే వెతుకుతారు. ఉదాహరణకు మరణించిన తమ కొడుక్కి.. మరణించిన అమ్మాయి సంబంధం కోసం వెతికారు. ఒక సంబంధం దొరికింది. కానీ, ఆ అమ్మాయి కాన్పులో మరణించిన తేదీలను పరిశీలించగా.. అబ్బాయి కంటే పెద్ద అని కుటుంబ సభ్యులు లెక్కించారు. అబ్బాయి కంటే పెద్ద కాబట్టి.. ఆ పెళ్లి సంబంధాన్ని వారు రద్దు చేసుకున్నారు.
