ప్రయాణికుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో చెన్నై మెట్రో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని అన్ని ప్రధాన మెట్రో స్టేషన్‌లలోనూ తల్లిపాల గదులను ఏర్పాటు చేస్తున్నారు.
‘చెన్నై మెట్రో రైల్’ (chennai metro rail) పరిధిలోని అన్ని ప్రధాన మెట్రో రైల్వే స్టేషన్లలో తల్లిపాల గదులు’ (బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్) (breast feeding room) ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే చెన్నై విమానాశ్రయ మెట్రో స్టేషన్‌లో ఈ గదిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసి మంగళవారం ప్రారంభించారు. దీనిలో భాగంగానే త్వరలో ఎగ్మూర్, ఆలందూర్, తిరుమంగళగం స్టేషన్లలోనూ తల్లిపాల గదిని ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. విమానాశ్రయ మెట్రోరైల్ స్టేషన్‌లో ప్రత్యేక ఏర్పాటు చేసిన తల్లిపాల గదికి ఏసీ సదుపాయాన్ని సైతం కల్పించారు.
పసికందుకు పడుకుని పాలు పట్టేందుకు అనువుగా ఒక మంచం, దిండు, పసిబిడ్డకు దుస్తులు, డైపర్ వంటివి మార్చేందుకు అనువైన టేబుల్, మొబైల్ చార్జింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేశారు. నగరంలోని సుదూర ప్రాంతాలకు ప్రయాణించేందుకు మెట్రోరైళ్లు అనువుగా వున్నాయి. చెమట చిందకుండా, తక్కువ చార్జీతో, త్వరితగతిన ప్రయాణం కావడంతో ప్రయాణికులు సైతం మెట్రో రైళ్ల వైపే మొగ్గుచూపుతున్నారు. అందుకే ఇటీవలి కాలంలో అన్ని మెట్రోరైళ్లకు ప్రయాణికుల తాకిడి గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే మెట్రో స్టేషన్లలో అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా అన్ని ప్రధాన మెట్రో రైల్వే స్టేషన్లలోనూ బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాలని చెన్నై మెట్రో రైల్ అధికారులు నిర్ణయించారు.
