ఇటీవల హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఓ ఏటీఎంలో ఆగంతకుల చోరీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఏటీఎంలో డబ్బులు నింపుతున్న సిబ్బందిపై కాల్పులు జరిపిన దుండగులు భారీగా నగదు చోరీ చేశారు.

ఈ ఘటనలో ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డారు. తాజాగా హర్యానాలో ఏటీఎం చోరీకి యత్నించిన దుండగులను సెక్యూరిటీ గార్డు ప్రాణాలకు తెగించి నిలువరించాడు. వివరాల్లోకి వెళితే.. హర్యానా రాష్ట్రం రోహ్‌తక్‌ నగరంలోని మకరౌలీలో ప్రాంతంలో వున్న యాక్సిస్‌ బ్యాంకు ఏటీఎంలో బుధవారం చోరీ చేసేందుకు దుండగులు యత్నంచారు.

Also Read:కూకట్‌పల్లి కాల్పుల కేసు: నిందితుల అరెస్ట్... సరిహద్దులు దాటకుండానే పట్టేసిన పోలీసులు

అయితే వారి ప్రయత్నాలను సెక్యూరిటీ గార్డు అడ్డుకున్నాడు. దుండగుల వద్ద తుపాకీ ఉన్నా భయపడకుండా తిరగబడ్డాడు. దీంతో దొంగలు అతడిపై కాల్పులు జరిపి పారిపోయారు. గాయపడిన సెక్యూరిటీ గార్డును బ్యాంక్ సిబ్బంది, స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమవ్వడంతో సెక్యూరిటీ గార్డు సాహసాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.