ఓ వృద్ధురాలి పట్ల కొందరు అమానుషంగా ప్రవర్తించారు. మంత్రగత్తె అంటూ ఆరోపిస్తూ.. ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించారు. 81ఏళ్ల వృద్ధురాలి ముఖానికి రంగు పూసి, మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. కాగా... ఆమె పట్ల అంత దారుణంగా ప్రవర్తించిన  దాదాపు 21 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా... దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... సర్కాఘట్ సబ్ డివిజన్ కి చెందిన ఓ వృద్ధురాలు ఒంటరిగా జీవిస్తోంది. కాగా... ఆమె మంత్రగత్తె అని... అందరిపై చేతబడి చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆమె ముఖానికి నలుపు రంగు పూసి... మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో బాధ్యులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం జైరాం ఠాకూర్‌ పోలీసులను ఆదేశించారు. సర్కాఘట్‌ సబ్‌డివిజన్‌లోని సమహాల్‌ గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. 

వృద్ధురాలిని మంత్రాల నెపంతో హింసించిన కేసులో 21 మందిని అరెస్ట్‌ చేశామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని మండి ఎస్పీ గౌరవ్‌ శర్మ తెలిపారు. కాగా ఇలాంటి ఘటన జరుగుతుందనే ఆందోళనతో తాను అక్టోబర్‌ 23న పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితురాలు కుమార్తె వెల్లడించారు. ఫిర్యాదు రాగానే పోలీసులు గ్రామాన్నిసందర్శించారని అయితే తర్వాత ఫిర్యాదును ఉపసంహరించుకున్నారని అధికారులు తెలిపారు.