Kolkata: జీఎస్టీ రేట్లపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ బుర్ర తక్కువ చర్యలు చేపడుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
West Bengal CM Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి కేంద్రంపై నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ మతిస్థిమితం కోల్పోయిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుర్రతక్కువ చర్యలు చేపడుతున్నదంటూ మండిపడ్డారు. అమరవీరుల దినం పురస్కరించుకుని గురువారం కోల్‌కతాలో జరిగిన భారీ ర్యాలీ సందర్భంగా ఆమె పై వ్యాఖ్యలు చేశారు. కాగా, 1993లో మమతా బెనర్జీ యూత్ కాంగ్రెస్ నేతగా ఉన్నారు. ఆ సమయంలో యూత్ కాంగ్రెస్ ర్యాలీ సందర్భంగా జరిగిన పోలీసు కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటినుంచి తృణమూల్ కాంగ్రెస్ జూలై 21న అమరవీరుల దినంగా జరుపుకుంటోంది. ప్రతిసంవత్సరం ఇదే రోజున తమ పార్టీ అనుసరిస్తూ... ముందు తీసుకోబేయే వివరాలను వెల్లడిస్తూ.. మెగా ర్యాలీని నిర్వహించడం ఆనవాయితీని పాటిస్తోంది.
ఈ క్రమంలోనే కోల్‌కతా ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జీఎస్టీ పరిధిలోలేని నిత్యావసరాలపై వస్తు-సేవల పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రంపై విమర్శల దాడిని కొనసాగించారు. బీజేపీ మతిస్థిమితం కోల్పోయిందని విమర్శించారు. "చూడండి, ఇప్పుడు మురి , మిష్టి (స్వీట్స్), లస్సీ (మజ్జిగ), పెరుగుపై కూడా GST పెట్టారు... ఒక పేషెంట్ హాస్పిటల్‌లో చేరితే.. వారి నుంచి కూడా జీఎస్టీ వసూలు చేస్తారు" అని వ్యాఖ్యానించారు. అలాగే, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ అంశాలను కూడా ప్రస్తావించారు. బీజేపీ ప్రభుత్వం ఎయిర్ ఇండియా, కోల్ ఇండియా, రైల్వేలు అన్నీ అమ్మేసింది. వారు చేసినదల్లా దేశంలోని ప్రతి అంశాన్ని అమ్మడమే ఎందుకంటే స్వాతంత్ర్యం సాధించడం ఎంత కష్టమో వారికి తెలియదు. ఇప్పుడు అగ్నిపథ్ స్కీమ్‌తో భారత ఆర్మీకి కూడా అదే పని చేయాలని చూస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగిన తన పదునైన ప్రసంగంలో "ఇప్పుడు LPG సిలిండర్ల ధరను చూడండి. ఇంధన ధరలను చూడండి. అంతే కాదు అగ్నిపథ్ పథకం ద్వారా భారత సైన్యాన్ని కూడా పలుచన చేస్తున్నారు. ఇది తమ పార్టీకి క్యాడర్‌ను సృష్టించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఇంధనం, ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను పెంచే ప్రభుత్వం అవసరం లేదు" మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసే కుట్రకు తెరలేపిందని ఆరోపించారు."వ్యవసాయ రంగ అభివృద్ధి విషయంలో బెంగాల్ అగ్రస్థానంలో ఉందని కేంద్రం కూడా గుర్తించింది. ఐటీ హబ్‌ల ఏర్పాటు నుంచి రాష్ట్రవ్యాప్తంగా రహదారులను తయారు చేయడం వరకు అన్ని రంగాల్లో అభివృద్ధిని మేము సాధించాము. మనం అభివృద్ధి పనులతో ముందుకు వెళ్లడానికి ప్రయత్నించినప్పుడల్లా.. బీజేపీ తన స్వంత ఎజెండాలతో ముందుకు వస్తుంది.. మమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. అయితే గుర్తుంచుకోండి, నన్ను, నా పార్టీని వారు ఎప్పటికీ ఆపలేరు" అంటూ మమతా బెనర్జీ అన్నారు. కాగా, కోవిడ్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా టీఎంసీ షాహీద్ దివాస్ ను నిర్వహించలేదు. గతేడాది టీఎంసీ విజయం సాధించిన తర్వాత వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుపుకుంటున్న మొదటి సమావేశం ఇది. దీంతో ప్రధాన్యత సంతరించుకుంది. అలాగే, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బీజేపీ నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని కూడా భావిస్తున్నారు.
