బీహార్ రాష్ట్రంలో ఆదివారం నిర్వహించిన బీపీఎస్ సీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష రాసిన అభ్యర్థులు అందరూ ఆందోళనకు గురయ్యారు. చివరకు పరీక్ష రద్దు చేస్తున్నట్టు ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.
బీహార్ లో బీపీఎస్ సీ పేపర్ లీక్ కేసుపై రాష్ట్రంలో దుమారం రేగుతోంది. దీనిపై ప్రభుత్వం అభ్యర్థులకు సమాధానం చెప్పాలని ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. పరీక్షకు హాజరయ్యేందుకు ఎక్కువ దూరం ప్రయాణించిన అభ్యర్థులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పేపర్ లీక్ విషయంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.
బీపీఎస్ సీ (బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పేరును బీహార్ పేపర్ లీక్ కమిషన్ గా మార్చాలని తేజస్వీ యాదవ్ సూచించారు.రాష్ట్రం నలుమూలల నుండి ప్రయాణించిన అభ్యర్థుల విషయంలో ఆయన మాట్లాడుతూ.. వారి సమయాన్ని వృథా చేసినందుకు, చాలా దూరం ప్రయాణం చేసేలా చేసినందుకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పరీక్షను రద్దు చేసినందుకు గాను అభ్యర్థులకు ప్రభుత్వం రూ.5000 నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
బీపీఎస్సీ 67వ కంబైన్డ్ కాంపిటీటివ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్- 2022ను మే 8వ తేదీన (ఆదివారం) నిర్వహించారు. అయితే పరీక్ష రాసిన కొన్ని గంటల తర్వాత బీపీఎస్సీకి ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించిన సమాచారం అందింది. ఇది వైరల్ అయింది. దీంతో బీపీఎస్సీ అంతర్గత కమిటీ వేసింది. అనంతరం పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను నిర్వహిస్తామని తెలిపింది. దానికి సంబంధించి త్వరలోనే అడ్మిట్ కార్డులను పంపిస్తామని పేర్కొంది.
ఈ కేసును ఎకనామిక్ అఫెన్స్ యూనిట్ కు అప్పగించారు. ఈ నిర్ణయం ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన లక్షలాది మంది విద్యార్థులను కలవరపరిచింది. పేపర్ ను రద్దు చేయడం వల్ల విద్యార్థుల్లో విభేదాలు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే పేపర్ లీకేజీ, పరీక్ష రద్దు నిర్ణయం తరువాత పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటాయని భావించి బీపీఎస్సీ కార్యాలయంలో భద్రతను మరింత పెంచారు. బీపీఎస్సీ ప్రధాన కార్యాలయం ప్రధాన గేట్ల వద్ద మెన్, ఉమెన్ పోలీసు దళాల సంఖ్యను పెంచారు.
