ఓ యువతిని బహిరంగ ప్రదేశంలో ఆమె ప్రియుడు దారుణంగా పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ యువతిని ఆమె ప్రియుడు కిరాతకంగా కత్తి పొడిచి హత్య చేశాడు. ముర్షిదాబాద్ జిల్లా బెర్హంపూర్ లో జరిగింది ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది స్థానికంగా కలకలం సృష్టించింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాల్డా ప్రాంతానికి చెందిన సుశాంత చౌదరి బెర్హంపూర్ ప్రాంతానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ కొంత కాలంగా సాన్నిహిత్యంగా ఉంటున్నారు. అయితే వారి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ.. సుశాంత చౌదరి ఆమె పై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె రక్తస్రావం జరిగి మృతి చెందింది.
దీనిని గమనించిన స్థానికులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో తన వద్ద ఉన్న తుపాకీని చూపించి కాల్పులు జరుపుతానని బెదిరించాడు. వారు బయపడగానే అక్కడి నుంచి అతడు పారిపోయాడు. వెంటనే స్థానికులు అంతా కలిసి ఆ యువతిని రక్షించడానికి ప్రయత్నించారు. హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు.
ఈ విషయం పోలీసులకు తెలియడంతో నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అన్ని పోలీస్ స్టేషన్లు అలెర్ట్ చేశారు. ఎట్టకేలకు సోమవారం రాత్రి శంసెర్ గంజ్ లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి నుంచి బొమ్మ తుపాకీ, కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ కత్తితోనే మహిళను పొడిచారని పోలీసులు తెలిపారు. ఈ విషయంలో ముర్షిదాబాద్ పోలీసు చీఫ్ కె. శబరి రాజ్‌కుమార్ మాట్లాడుతూ మృతురాలికి, నిందితుడు ముందే పరిచయం ఉందని తమకు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. హత్య వెనుక అసలు కారణం పూర్తి స్థాయి దర్యాప్తు తెలుస్తుందని అన్నారు.
ఈ ఘటన జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో స్థానికులు ఒక్క సారిగా భయం గుప్పిట్లోకి వెళ్లిపోయారు. అభద్రతాభావం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతానికి చెందిన మృదుల్ మోండల్ మాట్లాడుతూ... ఇక్కడ ఇలాంటివి జరగడం ఇదే మొదటిసారి అని తెలిపారు. ఈ ఘటనతో తాము తీవ్రంగా భయాందోళనలకు గురయ్యామని తెలిపారు. ఇక్కడ చాలా జనాభా నివసిస్తారని, అయినా ఓ యువతిని ఇలా బహిరంగంగా చంపారని చెప్పారు.
కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి నివాసానికి కూతవేటు దూరంలో ఈ హత్య జరిగింది. తన ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరగడం చూసి షాక్ అయ్యానని ఎంపీ అన్నారు. ‘‘ ఇది ఊహించలేనిది. బెంగాల్‌లో మహిళలకు భద్రత ఉండదా ? ఈ విషయంలో నేను డీజీపీతో మాట్లాడాను. నిందితుడిని అరెస్టు చేస్తామని ఆయన నాకు హామీ ఇచ్చారు’’ అని ఎంపీ మీడియాతో తెలిపారు.
